Narayana Murthi on ChatGPT | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్ బోట్ చాట్‌జీపీటీపై ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి కుండబద్ధలు కొట్టారు. టెక్నాలజీ రంగంలో మనుషుల, నిపుణుల అవసరాలను చాట్‌జీపీటీ వంటి చాట్ బోట్లు భర్తీ చేయలేవని తేల్చేశారు. మానవ మేధస్సును ఏదీ ఢీకొట్టలేదన్నారు.
ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ బోట్.. చాట్ జీపీటీ ఒక సంచలనం. దీనిపై టెక్ రంగంలో, సాఫ్ట్ వేర్ నిపుణుల్లో బోల్డు చర్చ జరుగుతున్నది. క్రుత్రిమ మేధ (ఏఐ) వల్ల కొలువులు పోతాయని పలువురు నిపుణులు ఆందోళనకు గురవుతున్నారు. సమీప భవిష్యత్‌లో ముప్పు వాటిల్లుతుందన్న వాదనలు వినిపిస్తున్న సమయంలో చాట్ జీపీటీ, దాని భవితవ్యంపై ఎన్ఆర్ నారాయణ మూర్తి అభిప్రాయం ప్రాధాన్యం సంతరించుకున్నది.
టెక్నాలజీ వల్ల మనుషుల లైఫ్ మరింత సులభతరం అవుతుందని నారాయణమూర్తి చెప్పారు. మనుషుల స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్ బోట్ భర్తీ చేస్తుందన్న వాదనలను తోసి పుచ్చారు. గతంలో కంప్యూటర్లు వచ్చిన తొలి రోజుల్లోనూ ఇదే అభిప్రాయం వచ్చిందని గుర్తు చేశారు. కంప్యూటర్ల రాకతో పౌరుల జీవితం సులభతరమైందన్నారు.
ఈ ప్రపంచంలో మానవ మేధస్సును మించిన శక్తి దేనికీ లేదని నారాయణమూర్తి తేల్చి చెప్పారు. ఏ కంప్యూటర్ కూడా మన మెదడుతో పోటీ పడలదేని స్పస్టం చేశారు. ఏఐ టూల్ రాకతో మనిషికి ఖాళీ సమయం ఎక్కువ దొరుకుతుందని, దీన్ని ప్రొడక్షన్ కోసం వినియోగించాలని హితవు చెప్పారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన అఖిల భారత యాజమాన్యాల సంస్థ వ్యవస్థాపక దినోత్సవంలో నారాయణమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ సైతం చాట్ జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ జీపీటీ వంటి చాట్బోట్లు.. ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయలేవని స్పష్టం చేసింది. ఏఐ ఆధారిత చాట్ బోట్ కేవలం కో-వర్కర్‌గా వ్యవహరిస్తూ ప్రొడక్షన్ మెరుగుదలకు ఉపయోగ పడతాయని తెలిపింది.