ముంబై, జూన్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లలో మళ్లీ ఐపీవోల సందడి నెలకొన్నది. మార్కెట్ ఒడిదుడుకులు, అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితుల నెలకొనడంతో కొన్ని నెలలపాటు వాయిదావేసిన కార్పొరేట్ సంస్థలు మళ్లీ తమ వాటాల విక్రయానికి సిద్ధమవుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు ఆశావాదంగా ఉండటం, గత కొన్ని రోజులుగా భారీగా లాభపడుతుండటంతో సంస్థలు తమ వాటా విక్రయ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు.
వీటిలో బ్లూచిప్ సంస్థలతోపాటు చిన్న స్థాయి కంపెనీలు సైతం స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టడానికి ఉవ్విళ్లురుతున్నాయి. వీటిలో భాగంగా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుబంధ సంస్థయైన హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తోపాటు కల్పతరు, ఎలెన్బ్యారీ ఇండస్ట్రియల్ గ్యాసెస్, సంభవ్ స్టీల్ ట్యూబెల్స్, గ్లోబ్ సివిల్ ప్రాజెక్టు లిమిటెడ్‌లు సంయుక్తంగా రూ.15 వేల కోట్లకు పైగా నిధుల సేకరణకోసం ఐపీవోకి వచ్చాయి. పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన రావడంతో ఆయా సంస్థలకు అధికంగా బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి. డజన్‌కు పైగా ఐపీవోలకు రూ.2 లక్షల కోట్ల వరకు బిడ్డింగ్‌లు వచ్చాయి.
వచ్చేవారంలో 19 సంస్థలు లిస్ట్ కాబోతున్నాయి. ఇందులో ఆరు అతిపెద్ద సంస్థలు కాగా, మిగతావి ఎస్ఎంఈ విభాగానికి చెందినవి 13 కంపెనీలు. వీటిలో కల్పతరు వాటాల విక్రయానికి మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. 2.26 రెట్ల సబ్స్క్రిప్షన్ అవగా, ఎలెన్బ్యారీ ఇండస్ట్రిస్ గ్యాసెస్ 22 రెట్లు, గ్లోబల్ సివిల్ ప్రాజెక్టు 86 రెట్ల బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి. ఈ సంస్థలు వచ్చే నెల 1న లిస్ట్కాబోతున్నాయి. అలాగే హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్లు జూలై 2న మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి.
స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టడానికి మరో రెండు సంస్థలు సిద్ధమవుతున్నాయి. వీటిలో సాఫ్ట్‌బ్యాంక్ మద్దతుతో నడుస్తున్న మీషో రూ.4,250 కోట్ల నిధుల సేకరణకు కంపెనీ వాటాదారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతోపాటు ఫుడ్లింక్ ఎఫ్అండ్బీ హోల్డింగ్స్(ఇండియా) వాటాల విక్రయ ప్రతిపాదనపై స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. 1.19 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించడం ద్వారా రూ.160 కోట్ల నిధులను సేకరించాలని సంస్థ భావిస్తున్నది. ఇలా సేకరించిన నిధులను భవిష్యత్తు వ్యాపార విస్తరణకోసం, రుణాలను తీర్చడానికి వినియోగించనున్నట్టు ప్రకటించింది.