ITR Benefits | గత ఆర్థిక సంవత్సరా (2022-23)నికి ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి కొద్ది రోజులు మాత్రమే టైం మిగిలింది. ఈ నెల 31 లోపు మీరు తప్పనిసరిగా ఐటీఆర్ సబ్మిట్ చేయాల్సిందే. చాలా మంది ప్రజలు తమ ఆదాయం రూ.2.5 లక్షల్లోపే కనుక.. తాము పన్ను చట్రం పరిధిలోకి రాబోమనుకుంటారు.. ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు.. మీరు ఆదాయం పన్ను చట్రం పరిధిలోకి రాకపోయినా పర్వాలేదు.. మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు. ఒకవేళ మీరు ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఐటీఆర్ ఫైలింగ్‌లో రుణాలు పొందడం తేలిక అవుతుంది. వీసా పొందాలన్న ఐటీఆర్ తప్పనిసరి. ఐటీఆర్ సబ్మిట్ చేయడంతో లాభాలు.. బెనిఫిట్లు ఏమిటో చూద్దామా..!
మీ ఆదాయానికి ఐటీఆర్ ఒక రుజువు.. ఒక ఆధారం. ఇన్‌కం ప్రూఫ్‌గా ఐటీఆర్‌ను బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) లు ఆమోదిస్తాయి. మీరు ఏదైనా బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేస్తే.. వెంటనే ఐటీఆర్ ఉందా? అని బ్యాంకు అధికారులు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు రెగ్యులర్‌గా ఐటీఆర్ దాఖలు చేస్తూ ఉంటే.. మీకు అవసరమైన రుణం పొందడం తేలిక అవుతుంది. ప్రతియేటా ఐటీఆర్ దాఖలు చేస్తూ ఉంటే.. ఏ ఆర్థిక సంస్థ నుంచైనా రుణం నుంచి పలు రకాల సర్వీసులు తేలిగ్గా పొందొచ్చు.
మీరు అమెరికాకో, బ్రిటన్‌కో.. ఆస్ట్రేలియాకో.. జర్మనీకో వెళ్లాలనుకుంటున్నారా. వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు సంబంధిత దేశం ఇమ్మిగ్రెంట్ అధికారులు మీ ఐటీ రిటర్న్స్ కోసం అడుగుతారు. మూడేండ్ల నుంచి ఐదేండ్ల వరకు ఐటీఆర్ పత్రాలు సమర్పించాలని కోరతారు. ఐటీఆర్ ద్వారా తమ దేశానికి వచ్చే వ్యక్తి ఆదాయం హోదా ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.
ఆదాయం పన్ను పరిమితికి లోబడి మీ ఆదాయం ఉన్నా.. దాని నుంచి పన్ను డిడక్ట్ చేసుకుంటే.. ఐటీఆర్ ఫైల్ చేయకుండా ప్రభుత్వం నుంచి రీఫండ్ కోసం క్లయిమ్ చేయలేరు. మీరు ట్యాక్స్ రీఫండ్ క్లయిమ్ చేయాలని కోరుకుంటే.. ఇందుకోసం ఐటీఆర్ దాఖలు చేయాల్సిందే. మీరు సమర్పించిన ఐటీఆర్‌ను ఆదాయం పన్ను విభాగం అధికారులు అంచనా వేసిన తర్వాత.. ఒకవేళ రీఫండ్ చేస్తే.. అది నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మీరు ప్రతియేటా సమర్పించే ఐటీఆర్.. మీ అడ్రస్ ప్రూఫ్‌గా పని చేస్తుంది. మీ రిజిస్టర్డ్ చిరునామాకు ఐటీఆర్ పత్రాలు వస్తాయి. ఇది మీ ఆదాయానికి రుజువుగా కూడా పని చేస్తుంది.
మీరు ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో పెట్టిన పెట్టుబడులపై నష్టం వచ్చిందా.. దాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొనసాగించొచ్చు. నిర్ధిష్ట గడువులోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారికి ఇది తప్పనిసరి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మీరు క్యాపిటల్ గెయిన్స్ పొందారనుకోండి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టంతో సర్దుబాటు చేయొచ్చు. తదుపరి పన్ను మినహాయింపు కోసం క్లయిమ్ చేయొచ్చు.