ముంబై, జూన్ 4: గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాలపై వడ్డీరేట్లు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటుకు 50 బేసిస్ పాయింట్లు కోతపెట్టే వీలుందని తెలుస్తున్నది మరి. బుధవారం ఆర్బీఐ ఈ ఏడాదికిగాను మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ప్రారంభించింది. శుక్రవారం ఇందులో తీసుకున్న నిర్ణయాలు వెల్లడి కానున్నాయి.
ఈ క్రమంలోనే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) 25 బేసిస్ పాయింట్లు లేదా కుదిరితే 50 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చన్న అంచనాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే గత రెండు ద్రవ్యసమీక్షల్లో (ఫిబ్రవరి, ఏప్రిల్) రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల చొప్పున మొత్తం 50 బేసిస్ పాయింట్లు ఆర్బీఐ దించింది. దీంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6 శాతానికి దిగొచ్చింది. కాగా, ఈ ఏడాది జరిగే మరో 3 ద్రవ్యసమీక్షల్లోనూ వడ్డీరేట్ల తగ్గింపులకు చాన్స్ ఉందని ఆర్థిక, బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.