ముంబై, అక్టోబర్ 4: స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. నాలుగు రోజులుగా అమ్మకాలకు మొగ్గుచూపిన పెట్టుబడిదారులు ఇంధనం, ఆర్థిక, ఐటీ రంగాలకు చెందిన షేర్లను ఎగబడి కొనుగోళ్ళు జరుపడంతో సూచీలు లాభాలు బాటపట్టాయి. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్ల పతనం, మరోవైపు దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు పడినప్పటికీ మదుపరులు వీటిని పట్టించుకోలేదు. కార్పొరేట్ల ఆశాజనక ఫలితాలు, కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుండంపై పెట్టుబడిదారులు దృష్టి సారించారు. ఫలితంగా ఎగబడి కొనుగోళ్ళు జరుపడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మళ్లీ 59 వేల పాయింట్ల పైకి చేరుకున్నది. ప్రారంభం నుంచే లాభాల బాటపట్టిన సూచీ చివరకు 533.74 పాయింట్ల లాభంతో 59,299.32 వద్ద ముగిసింది. అటు జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 159.20 పాయింట్లు అందుకొని 17,691.25 వద్ద ముగిసింది.
3 లక్షల కోట్లు పెరిగిన సంపద
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడంతో మదుపరుల సంపద భారీగా పెరిగింది. సోమవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి మదుపరులు రూ.3,10,851.75 కోట్ల మేర సంపద పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.2,62,71,347.10 కోట్లుగా నమోదైంది. గడిచిన వారం చివరి నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,312.30 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే.