ముంబై, జనవరి 1: నూతన సంవత్సరానికి రూపాయి నష్టాలతోనే స్వాగతం పలికింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూపీ మారకం విలువ సోమవారం మరో 5 పైసలు క్షీణించింది. ఉదయం ట్రేడింగ్ ఆరంభం నుంచే నేలచూపుల్ని చూసిన రూపాయి.. చివరిదాకా అదే తీరును కనబర్చింది. ఈ క్రమంలోనే 83.21 వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతోనే సరిపెట్టడం, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం.. రూపీ వాల్యూని దిగజార్చిందంటూ ట్రేడింగ్ సరళిని ఫారెక్స్ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు.
గత ఏడాదికి ట్రేడింగ్ చివరి రోజైన శుక్రవారం రూపాయి మారకం విలువ 4 పైసలు కోలుకుని 83.16 వద్ద స్థిరపడిన విషయం తెలిసిందే. అయితే సోమవారం ఆ లాభాలు కాస్తా ఆవిరైపోయాయి. భారతీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) సోమవారం రూ.855.80 కోట్ల విలువైన షేర్లను అమ్మేసుకున్నారు. ఇది కూడా రూపీని ప్రభావితం చేసిందన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి.