Sensex | ముంబై, జూలై 18: మార్కెట్ రికార్డుల ర్యాలీ మంగళవారం సైతం కొనసాగింది. ఇంట్రాడేలో బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 67,000 స్థాయిని తాకింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,800 పాయింట్లను అందుకుంది. ఈ స్థాయిల్ని సూచీలు చేరిన తర్వాత జరిగిన అమ్మకాలతో కొద్దిపాటి లాభాల్ని కోల్పోయినప్పటికీ, చివరకు కొత్త రికార్డుస్థాయిలో ముగిసాయి. 205 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 66,795 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 19,749 పాయింట్ల వద్ద నిలిచింది. సోమవారం రాత్రి అమెరికా మార్కెట్ ర్యాలీ, తాజాగా యూరప్ సూచీలు లాభాలతో ట్రేడ్కావడం దేశీయ ఈక్విటీలు కొత్త చరిత్ర సృష్టించాయి.
ఇన్ఫోసిస్ అదుర్స్
తాజా ర్యాలీకి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నేతృత్వం వహించింది. 2 బిలియన్ డాలర్ల ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రాజెక్టు లభించిందన్న వార్తలతో ఈ షేరు 3.67 శాతం పెరిగి రూ. 1,575 వద్దకు చేరుకుంది. ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్లు 1-2 శాతం మేర లాభపడ్డాయి. మరోవైపు ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, టాటా స్టీల్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్లు స్వల్ప నష్టాల్ని చవిచూశాయి. రంగాలవారీగా బీఎస్ఈ ఐటీ 1.15 శాతం పెరిగింది. టెక్నాలజీ సూచీ 1.13 శాతం, పవర్ 0.57 శాతం, ఇండస్ట్రియల్స్ 0.27 శాతం చొప్పున లాభపడ్డాయి. మెటల్, రియల్టీ, టెలికమ్యునికేషన్స్ సూచీలు తగ్గాయి.
అధిక విలువతో ఆందోళన
బుల్స్ మార్కెట్ కొత్త గరిష్ఠాలకు అవలీలగా చేర్చినప్పటికీ ఇంట్రాడేలో ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయని, మార్కెట్ అధిక విలువలకు చేరిందన్న ఇన్వెస్టర్ల ఆందోళనే ఇందుకు కారణమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే డాలర్ ఇండెక్స్ శరవేగంగా పతనంకావడం, యూఎస్ బాండ్ ఈల్డ్స్ తగ్గడంతో విదేశీ నిధులు ప్రవాహం కొనసాగడం భారత్ మార్కెట్కు సానుకూలాంశమని వివరించారు.