హైదరాబాద్, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఏరోస్పేస్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన అటకెక్కినట్లే కనిపిస్తున్నది. తెలంగాణను ఏరోస్పేస్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు దేశ, విదేశీ దిగ్గజ కంపెనీల భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు ప్రకటించారు. అంతేకాదు, రాష్ట్రంలో అనేక అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు ద్వారా ఏరోస్పేస్ రంగ అభివృద్ధికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను కూడా నెలకొల్పింది.
కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ కీలక ప్రతిపాదనను కాంగ్రెస్ సర్కార్ మూలనపడేసింది. దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించడానికి నిరాకరిస్తున్నారు. నిజానికి గత ప్రభుత్వ కృషితో అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్, టాటా గ్రూపు సంయుక్తంగా తయారీ కేంద్రాన్ని నెలకొల్పాయి. ఇక్కడ తయారవుతున్న హెలీకాప్టర్ క్యాబిన్లు సహా ఇతర విడిభాగాలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అలాగే బోయింగ్, జీఈ, ప్రాట్ అండ్ విట్నీ, శాఫ్రాన్, జీఎమ్మార్ తదితర కంపెనీలు హైదరాబాద్‌లో తయారీ కేంద్రాలతోపాటు ఎంఆర్వో(మెయింటనెన్స్, రిపేర్ అండ్ ఒవరాల్)లను ఏర్పాటు చేశాయి. వీటికి అనుబంధంగా వెయ్యికి పైగా చిన్న సంస్థలు వెలిశాయి.
ఆదిబట్లలోనే అంకురార్పణ
దేశంలోనే మొట్టమొదటి ఏరోస్పేస్ క్లస్టర్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌కు సమీపంలోని ఆదిబట్లలో ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఏరోస్పేస్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత ఏడాది కేటీఆర్ అమెరికా పర్యటన సందర్భంగా పలు ఏరోస్పేస్ కంపెనీలు రాష్ట్రంలో తమ పెట్టుబడులను విస్తరించడంతోపాటు వర్శిటీ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ప్రతిపాదన ముందుకు సాగకపోవడంతో ఆ సంస్థలు కూడా వెనుకంజ వేసినట్లు తెలుస్తున్నది. ఈ యూనివర్శిటీ ఏర్పాటువల్ల ఇక్కడే పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా ఏరోస్పేస్ రంగం విస్తరించే అవకాశముంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.