Wheat Price | దేశంలో గోధుమల ధరల పెరుగుతున్నది. మార్కెట్లో రికార్డుస్థాయిలో టన్ను రూ.34వేలకు చేరుకున్నది. దీంతో పిండి మిల్లులతో పాటు ఇతర పరిశ్రమలపై సైతం ఒత్తిడి పెరుగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (OMSS), దిగుమతి సుంకాన్ని తగ్గించాలని పిండి మిల్లు యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లో గోధుమలు అందుబాటులో లేవని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే స్టాక్ ఉందని.. దాని కారణంగా ధరలు పెరిగాయి. బహిరంగ మార్కెట్లో విక్రయాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు.
దాంతో దృష్టి మొత్తం ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా స్టాక్ పంపిణీపై ఉన్నది. డిమాండ్‌కు సరిపడా నిల్వలు లేకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది. గోధుమలు ప్రైవేట్ స్టాకిస్టుల వద్ద మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. మార్కెట్లో ప్రభుత్వ నిల్వలు పరిమితంగానే ఉన్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రైవేట్ స్టాకిస్టుల ధరలను ఎక్కువ శాతం పెంచుతున్నారు. ఢిల్లీలో గోధుమ ధర క్వింటాల్‌కు రూ.3,200 చేరుకుంది. ప్రస్తుతం ధరలు మిగతా ప్రాంతాల్లోనూ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో గోధుమలు దాదాపు రూ.2,800కే అందుబాటులో ఉన్నాయి. కోయంబత్తూరు, బెంగళూరు, చెన్నైకి వచ్చే సరికి ధర రూ.3,400కి చేరుకుంది. గోధుమల ధరలు ఒక్కసారిగా పెరగడానికి పరిమిత లభ్యత కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం, ఉత్తరప్రదేశ్‌లో కొంత పరిమాణంలో గోధుమలు అందుబాటులో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్ వంటి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లో సరఫరా తగ్గింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన యూనిట్ అయిన ఏజీ మార్కెట్ డేటా ప్రకారం.. గోధుమ ప్రస్తుత సగటు మార్కెట్ ధర క్వింటాల్‌కు రూ.2,811. ఇది ఈ సంవత్సరం కనీస మద్దతు ధర రూ.2,275 కంటే చాలా ఎక్కువ. కాగా, గత నెలలో రిటైల్ ధరలో 2.2 శాతం పెరుగుదల నమోదైంది. దీంతో దీని ధర ప్రస్తుతం కిలో రూ.31.98కి చేరుకుంది. కొత్త పంట వచ్చే వరకు వచ్చే ఐదు నెలల్లో దేశంలో గోధుమ సరఫరాకు భారీ కొరత ఏర్పడే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.