హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారులకు పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) ఇంకా అందలేదు. బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన కోలిండియా తన సిబ్బందికి పీఆర్పీ ఇచ్చినా సింగరేణి మాత్రం ఇంతవరకు చెల్లించలేదని అధికారులు వాపోతున్నారు. సంస్థ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పీఆర్పీని తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సింగరేణిలో పనిచేసే అధికారులకు సంస్థ పనితీరు, పనిచేస్తున్న గని, వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఈ పీఆర్పీని ఏటా చెల్లిస్తారు. అయితే నిరుడు పీఆర్పీ చెల్లించకపోవడంతో కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 22 వరకు ఏటా చెల్లించారు.
2022 -23కు మాత్రం ఆగింది. కాగా, 2007-14 వరకు రూ.65 కోట్లు, 2022 -23కాలానికి రూ. 115 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. సంస్థ పరిధిలో 2,500మంది అధికారులున్నారు. దీంతో పీఆర్పీ కింద ఒక్కో అధికారికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వచ్చే అవకాశం ఉన్నదని అంచనాలేసుకుంటున్నారు.