హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ కంపెనీలకు నిలయంగా మారుతున్నది హైదరాబాద్ నగరం. ఇప్పటికే పలు గ్లోబల్ కంపెనీలు ఇక్కడ కార్యాలయాలను ప్రారంభించగా..తాజాగా బహుళ జాతి కంపెనీలు తమ కార్యకలాపాల నిర్వహణలో అత్యంత కీలకమైన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ను ఏర్పాటు చేశాయి. వీటిలో ఈటీఎస్-ఫస్ట్‌సోర్స్ ఏర్పాటు చేసిన జీసీసీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ శనివారం ప్రారంభించారు.
దీంతోపాటు స్విట్జర్లాండ్‌కు చెందిన ఫార్మా దిగ్గజ సంస్థ శాండోజ్… రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో తన నూతన జీసీసీ కేంద్రాన్ని ప్రారంభించింది కూడా. ఇలా ఒక్క ఏడాదిలోనే అత్యధికంగా జీసీసీ కేంద్రాలు ఏర్పాటు కావడం హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతే ప్రధాన కారణమని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నారు. జీసీసీ నిర్వహణకు అత్యంత కీలకమైన వనరులు, మౌలిక వసతులు ఇక్కడ పుష్కలంగా ఉండటంతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. గత నెల చివరినాటికి ఇక్కడ 11 జీసీసీలు ఏర్పాటయ్యాయని నాస్కామ్ జీనోవ్ తాజా నివేదికలో వెల్లడించింది.