రాయితీల్లో కోత!
ఇన్నాళ్లూ విద్యుత్తు ఆధారిత వాహన పరిశ్రమను నెత్తిన పెట్టుకున్న మోదీ సర్కారు.. ఇప్పుడు కత్తికడుతున్నదా? అంటే అవుననేలాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)దే.. కావాల్సిన మౌలిక వసుతులన్నీ కల్పిస్తున్నాం..
- పరిశీలిస్తున్న కేంద్రం
- ఈవీల అమ్మకాలు పడిపోతాయని పరిశ్రమ లబోదిబో
- పెరగనున్న టూవీలర్ల ధరలు
- గరిష్ఠంగా రూ. 40వేలు పైకి
న్యూఢిల్లీ, మే 18: ఇన్నాళ్లూ విద్యుత్తు ఆధారిత వాహన పరిశ్రమను నెత్తిన పెట్టుకున్న మోదీ సర్కారు.. ఇప్పుడు కత్తికడుతున్నదా? అంటే అవుననేలాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)దే.. కావాల్సిన మౌలిక వసుతులన్నీ కల్పిస్తున్నాం.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇదే సరైన సమయం.. పెట్టుబడులతో రండి.. ప్రోత్సాహకాలు ఇస్తాం.. అంటూ కేంద్ర ప్రభుత్వం ఊదరగొట్టిన విషయం తెలిసిందే. దీన్ని నమ్మి దేశ, విదేశాల నుంచి ఈవీల తయారీ రంగంలోకి పెట్టుబడులు తరలివచ్చిన సంగతీ విదితమే. అయితే ఇప్పుడు ఈ పెట్టుబడిదారుల గుండెలు బద్దలయ్యేలా ఎలక్ట్రిక్ టూవీలర్లపై సబ్సిడీలను తగ్గించే యోచనలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉన్నట్టు తెలుస్తున్నది.
25 శాతం తగ్గింపు
తమ ప్రతిష్ఠాత్మక పథకం ఫేమ్-2 కింద కేటాయింపులను ప్రస్తుత స్థాయి రూ.2,000 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. అయితే ఈ నిధులను ఎలక్ట్రిక్ టూవీలర్లకు ఇచ్చే సబ్సిడీలో కోతపెట్టి సమకూర్చుకోవాలన్నట్టు యోచిస్తుండటమే ఇప్పుడు పరిశ్రమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రస్తుతం ఒక్కో ఈవీ టూవీలర్‌కు దాని ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో 40 శాతానికి సమానంగా సబ్సిడీని అందిస్తున్నారు. కానీ ఇక దీన్ని 15 శాతానికి పరిమితం చేయాలని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆలోచిస్తున్నది మరి. దీంతో సబ్సిడీలో 25 శాతం కోత పడుతున్నదన్నమాట. ఇది ధరను గరిష్టంగా 40వేలు పెంచుతున్నది.
అమ్మకాలకు దెబ్బ
ఫేమ్ స్కీంలో భాగంగా ఎలక్ట్రిక్ టూవీలర్ల కోసం ఇస్తున్న సబ్సిడీలో కోత పెడితే.. అమ్మకాలు పెద్ద ఎత్తున పడిపోయే వీలుందని పరిశ్రమ భయపడుతున్నది. ఇప్పుడిప్పుడే ఈవీ టూవీలర్ల కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయని, ఈ సమయంలో రాయితీల తగ్గింపు.. ఒక్కో వాహనం ధరను గణనీయంగా పెంచగలదని, ఇదే జరిగితే మార్కెట్ మొత్తం పడిపోతుందని కంపెనీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈవీ టూవీలర్లను కొనాలనుకునేవారు మళ్లీ ఇంధన ఆధారిత వాహనాల వైపే చూడవచ్చని, దీంతో కంపెనీలకు నష్టాలు తప్పవని, ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడులూ వృథానేనన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చాలా పెట్రో టూవీలర్ల ధర లక్ష రూపాయలకు దిగువనే ఉన్నది. సబ్సిడీల్లో కోత పడితే ఈవీ టూవీలర్ల ధర రూ.1.5 లక్షలు దాటవచ్చు.
మార్చిలో ఫేమ్-2కు స్వస్తి?
వచ్చే ఏడాది మార్చితో ఫేమ్-2కు ముగింపు పలకాలని లేదా ఫేమ్-3ని పరిచయం చేయాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సంబంధిత ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికిల్స్ తయారీ, వినియోగాన్ని పెంచాలనే లక్ష్యంతో 2019 ఏప్రిల్ 1న ఫేమ్ ఇండియా స్కీంను కేంద్ర ప్రభుత్వం పరిచయం చేసింది. తొలుత మూడేండ్లకుగాను దీన్ని అమలు చేయాలనుకున్నారు. ఆ తర్వాత రెండేండ్లు పొడిగించగా, వచ్చే ఏడాది మార్చి ఆఖరుతో ఈ గడువు ముగుస్తున్నది. దీంతో దీన్నిక పెంచేది లేదన్న నిర్ణయానికి కేంద్రం వచ్చినట్టు చెప్తున్నారు. ఫేమ్-2 పథకం కింద ఈవీ కొనుగోలుదారులకు ప్రోత్సాహకాల కోసం రూ.10,000 కోట్లను కేటాయించినది తెలిసిందే.
‘సబ్సిడీలో ఈ భారీ కోతలు మార్కెట్‌ను దెబ్బతీస్తాయని మేము ఆందోళన చెందుతున్నాం. విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు బాగా పడిపోయే అవకాశాలున్నాయి. ఈ రకంగా తీసుకునే ప్రభుత్వ నిర్ణయం తిరోగమన దశకే దారితీయగలదు’
-సోహిందర్ గిల్, ఈవీ తయారీదారుల సంఘం డైరెక్టర్ జనరల్
‘ఈవీ టూవీలర్లపై రాయితీలను తగ్గిస్తే.. ఎన్నో చెడు పరిణామాలు ఎదురవుతాయి. ముడి చమురును విదేశాల నుంచి ఇంకా దిగుమతి చేసుకోవాల్సి రావచ్చు. ఇది ఫారెక్స్ నిల్వల్ని ప్రభావితం చేయగలదు. పైగా వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది’
-ఆయుష్ లోహియా,లోహియా ఆటో ఇండస్ట్రీస్ సీఈవో
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

