Stock Market | నాలుగో త్రైమాసిక ఫలితాల తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్ హవా కొనసాగుతున్నది.. వారం తొలిరోజైన సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడవుతుండగా.. బ్యాకింగ్ నిఫ్టీ గత రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరింది.ఈ క్రమంలో ప్రైవేటురంగ బ్యాంకులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రెండుశాతానికిపైగా లాభపడ్డాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సోమవారం రెండుశాతానికిపైగా పెరిగి ఏడాదిలో గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభంలో 7 శాతం పెరిగింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు బీఎస్ఈలో 2.27శాతం పెరిగి రూ.1,950కి చేరుకున్నాయి. ఈ క్రమంలో 52 వారాల గరిష్ట స్థాయికి పెరిగింది. ఎన్ఎస్ఈలో ఇది 2.30శాతం పెరిగి రూ.1,950.70కి చేరుకుంది. ICICI బ్యాంక్ షేర్లు కూడా సోమవారం ఉదయం 2 శాతానికి పైగా పెరిగాయి. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 15.7 శాతం పెరిగి రూ.13,502 కోట్లకు చేరుకుందని కంపెనీ నివేదించింది. బీఎస్ఈలో కంపెనీ షేర్లు 2.15 శాతం పెరిగి రూ.1,437కు చేరుకున్నాయి. ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్లు 2.08 శాతం పెరిగి 52 వారాల గరిష్ఠ స్థాయి చేరి రూ.1,436 వద్ద ట్రేడవుతున్నాయి.
మరో వైపు భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 78,903.09 పాయింట్ల వద్ద మొదలైన మార్కెట్ ప్రస్తుతం 1,071.14 పెరిగి 79,624.34 పాయింట్ల వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 331.05 పాయింట్లు పెరిగి.. 24,182.70 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. అమెరికా ప్రతీకార సుంకాల నుంచి తేరుకున్న మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ లాభాల్లో కొనసాగుతున్నది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ మునుపటి రికార్డును బద్దలు కొట్టి మొదటిసారిగా 55వేల మార్కును దాటింది. ప్రైవేట్ రంగ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ అద్భుతమైన నాల్గవ త్రైమాసిక ఫలితాలు ఈ పెరుగుదలకు కారణమయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 55,396.40 (2.05శాతం) వద్ద ట్రేడవుతోంది. ఈ క్రమంలో కొత్త ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 55,433.60కి చేరుకుంది.