ముంబై, జనవరి 6: దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా రెండోరోజూ మంగళవారం సూచీలు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, భారత్‌పై మరిన్ని సుంకాలు విధించబోతున్నట్టు అమెరికా ప్రకటించడం మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. ఇంట్రాడేలో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా నష్టపోయి 85 వేల దిగువకు పడిపోయింది. చివర్లో ఈ 376.28 పాయింట్ల నష్టంతో 85,063.34 వద్ద స్థిరపడింది.
మరో సూచీ నిఫ్టీ 71.60 పాయింట్లు కోల్పోయి 26,178.70 వద్ద నిలిచింది. దేశీయ మార్కెట్లు దిద్దుబాటలో కొనసాగుతున్నాయని, లార్జ్-క్యాప్ సూచీల్లో గందరగోళం నెలకొనడం సూచీల పతనానికి కారణమని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అలాగే కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉంటాయన్న అంచనా మదుపరుల్లో నెలకొన్నది.
రిలయన్స్ షేరు కుప్పకూలింది. మంగళవారం కంపెనీ షేరు 4.42 శాతం నష్టపోయి రూ.1,507.70 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈలోనూ 4.46 శాతం తగ్గి రూ.1,507. 60 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.94,388 కోట్లు కరిగిపోయి రూ.20, 40,290.90 కోట్లకు జారుకున్నది.