ముంబై, డిసెంబర్ 23: దేశీయ కరెన్సీ రూపాయి విలువ మళ్లీ పడిపోయింది. గత వారం ఆల్‌టైమ్ కనిష్ఠానికి దిగజారిన రూపీ.. ఆ తర్వాత బాగానే కోలుకున్నట్టు కనిపించింది. కానీ సోమవారం తిరిగి నష్టాల్లోకి జారుకున్నది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 7 పైసలు క్షీణించి 85.11 వద్ద ముగిసింది. శుక్రవారం 9 పైసలు కోలుకోగా.. అంతకుముందు రోజు గురువారం 19 పైసలు కోల్పోయి మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి 85.13 వద్దకు మారకపు విలువ పతనం కావడం గమనార్హం.
ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వచ్చే ఏడాది వడ్డీరేట్ల కోతల్ని తగ్గిస్తామని ప్రకటించిన దగ్గర్నుంచి ఫారెక్స్ మార్కెట్లో డాలర్లకు డిమాండ్ మరింతగా పెరిగింది. దేశీయంగానూ దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెద్ద ఎత్తున ఆదరణ కనిపిస్తున్నది.
ఫలితంగా డాలర్ ముందు రూపాయి ఏమాత్రం నిలువలేకపోతున్నదని ఫారెక్స్ ట్రేడర్లు చెప్తున్నారు. అలాగే భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయంటూ తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. నిజానికి ఉదయం 85.02 వద్దే మొదలైనా.. ఆఖర్లో మాత్రం ఇంకా రూపీ నేలచూపులు చూసింది.