Rupee | న్యూఢిల్లీ/దావోస్/ముంబై, జనవరి 23: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువే అత్యంత దారుణంగా పడిపోతున్నదని, దక్షిణ/ఆగ్నేయాసియా దేశాల్లో భారత కరెన్సీ తప్ప.. మరే దేశ కరెన్సీ కూడా ఇంత అధ్వాన్న రీతిలో ప్రదర్శన ఇవ్వడం లేదని ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొన్నది. గత రెండేండ్లలో దాదాపు 5 శాతం, ఐదేండ్ల (జనవరి 2020 నుంచి)లో ఏకంగా 20 శాతానికిపైగా నష్టపోయిందని గురువారం తెలియజేసింది. ఇకపోతే రేటింగ్ ఉన్న 23 భారతీయ సంస్థల్లో 6 మాత్రమే బలపడుతున్న డాలర్‌తో ప్రభావితమవుతున్నాయని చెప్పింది.
రూపాయి విలువ క్షీణతకు కారణం డాలర్ విలువ పెరుగుతూపోతుండటమేనని, ఇలాంటప్పుడు ఆర్బీఐ జోక్యం.. భారతీయ ఎగుమతుల్ని నష్టపర్చగలదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. దావోస్‌లో మాట్లాడుతూ.. గృహస్తుల వినియోగ సామర్థ్యం పెరిగేలా, ఉద్యోగావకాశాలు ఏర్పడేలా భారత ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు. ఇదిలాఉంటే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం మరో 9 పైసలు పడిపోయింది. 86.44 వద్ద స్థిరపడింది.