హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధి విషయంలో ప్రభుత్వ వైఖరి ఆరంభశూరత్వంగా మారింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నూతన పాలసీని ప్రవేశపెట్టి రెండేండ్లు కావాస్తున్నా ఇంతవరకు ఉత్తర్వులు విడుదల చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. చిన్నతరహా యూనిట్లు నెలకొల్పాలనుకునేవారు ప్రభుత్వ ఉత్తర్వులకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంఎస్ఎంఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్త పాలసీని ప్రవేశపెడతామని ప్రకటించింది. సెప్టెంబర్ 2024లో ఎంఎస్ఎంఈ పాలసీ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రాబోయే ఐదేండ్లలో రూ.4వేల కోట్ల పెట్టుబడితో 25వేల కొత్త యూనిట్లు, 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించింది. పరిశ్రమలకు అవసరమైన భూములు, రుణాలు, ముడి సరుకు, సాంకేతికత, నైపుణ్యం, మారెటింగ్ తదితర ఆరు ప్రధాన సవాళ్లను పరిషరించడంపై ఈ పాలసీ దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు.
ఇందులో ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల్లోని ప్రోత్సహకాలనే కాస్త అటుఇటుగా మార్చి అమలుచేయాలని నిర్ణయించారు. మూలధన పెట్టుబడిపై 25శాతం వరకు సబ్సిడీలు, ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్క్‌ల ఏర్పాటు, ప్రైవేట్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీల ఏర్పాటు, సిడ్బీతో కలిసి మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను చేర్చారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే భూములకు సంబంధించి గతంలో 33శాతం రాయితీ ఉండగా, కొత్త పాలసీలో దాన్ని 50 శాతానికి పెంచారు.
జీఎస్డీపీలో ఎంఎస్ఎంఈల వాటాను 10 శాతం పెంచాలని, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని, ఈ-కామర్స్ ద్వారా మార్కెట్ అవకాశాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టాటా టెక్నాలజీస్ సౌజన్యంతో రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ)గా మార్చడం ద్వారా పరిశ్రమలకు నైపుణ్యం గల సిబ్బందిని అందించాలని నిశ్చయించారు. స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటుచేసి పరిశ్రమలకు నైపుణ్యాలను వృద్ధి చేయాలని నిర్ణయించారు.
అయితే, పాలసీకి సంబంధించి ఘనంగా మార్గదర్శకాలు రూపొందించిన ప్రభుత్వం, ఇంతవరకు ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. నూతన ఎంఎస్ఎంఈ పాలసీని తెచ్చినట్టు, మార్గదర్శకాలు కూడా రూపొందించినట్టు, త్వరలోనే ఉత్తర్వులు జారీచేస్తామని వెల్లడించింది. అంతేకాకుండా పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంసీ, పీఎం విశ్వకర్మ తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఎంఎస్ఎంఈలకు సహకారం అందిస్తున్నట్టు తెలిపింది. పాలసీ ప్రవేశపెట్టి రెండేండ్లు కావస్తున్నా ఇంతవరకు ఉత్తర్వులు జారీచేయకపోగా, కేంద్ర ప్రభుత్వ పథకాలను తాము అమలు చేస్తున్నట్టు చెప్పడం విమర్శలకు తావిస్తున్నది. కొత్త పాలసీ అమల్లోకి వస్తే అదనపు ప్రయోజనాలు పొందవచ్చనే ఉద్దేశంతో చాలామంది పారిశ్రామికవేత్తలు ఎదురుచూస్తున్నారు.