Ratan Tata- Cyrus Mistry | ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవాధ్యక్షుడు రతన్ టాటా ఇటీవలే కన్ను మూశారు. మానవతా వాదిగా, దాతగా ఆయనను ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. మానవీయ కోణంలో స్పందించే రతన్ టాటా.. రోజువారీ పారిశ్రామిక వ్యవహారాల్లోనూ అంతే పారదర్శకంగా ఉండేవారు. 75 ఏండ్లు పూర్తయిన తర్వాత 2012 డిసెంబర్లో టాటా సన్స్ చైర్మన్గా వైదొలిగిన రతన్ టాటా వారసుడిగా సైరస్ మిస్త్రీ బాధ్యతలు స్వీకరించారు. ఏడాది ముందే అంటే 2011లోనే సైరస్ మిస్త్రీని టాటా సన్స్ ఎంపిక కమిటీ చైర్మన్ గా సెలెక్ట్ చేసినప్పటి నుంచి ఏడాది పాటు చైర్మన్ డిజిగ్నేట్ గా సైరస్ మిస్త్రీ పని చేశారు. సరిగ్గా టాటా సన్స్ చైర్మన్ గా సైరస్ మిస్త్రీ బాధ్యతలు స్వీకరించే సమయం వచ్చే నాటికే.. ఆ పదవికి సరైన వ్యక్తేనా అని రతన్ టాటా పునరాలోచనలో పడ్డారని ‘రతన్ టాటా ఏ లైఫ్’ అనే పుస్తకం పేర్కొంది. ఇటీవల కన్నుమూసిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా జీవితంపై థామస్ మ్యాథ్యూ రాసిన ఈ పుస్తకాన్ని హార్పర్ కొల్లిన్స్ పబ్లిషర్స్ అనే సంస్థ ప్రచురించింది.
2016 అక్టోబర్లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని కంపెనీ డైరెక్టర్ల బోర్డు తొలగించింది. అప్పుడు కూడా సైరస్ మిస్త్రీ కంటే, ఆయన్ను తొలగించేందుకు రతన్ టాటా ఎక్కువ కష్ట పడ్డారని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మాజీ డీన్ నితిన్ నోహ్రియా వ్యాఖ్యానించారని థామస్ మాథ్యూ తన పుస్తకంలో రాసుకున్నారు. అప్పుడు టాటా సన్స్ డైరెక్టర్ వేణు శ్రీనివాసన్ కూడా సైరస్ మిస్త్రీ కంటే ఆయన్ను తప్పించడానికి ఎక్కువగా రతన్ టాటా బాధ పడ్డారని ‘రతన్ టాటా ఏ లైఫ్’ పుస్తకం వ్యాఖ్యానించింది. డైరెక్టర్ల విశ్వాసం కోల్పోయినట్లు స్పష్టంగా తెలిసిన తర్వాత బాధ్యతల నుంచి హుందాగా సైరస్ మిస్త్రీ తప్పుకుంటే బాగుండేదని రతన్ టాటా కోరుకున్నారని ఆ పుస్తకం తెలిపింది.