Stock Market | న్యూఢిల్లీ, జూలై 17: దేశీయ స్టాక్ మార్కెట్లలో పెద్ద షేర్ల కంటే.. చిన్న షేర్లే ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా మదుపరులకు ఎక్కువగా లాభాలను పంచినవి స్మాల్, మిడ్ స్టాక్సే మరి. జనవరి మొదలు ఈ నెల 16దాకా బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) మిడ్‌క్యాప్ సూచీ 10,984.72 పాయింట్లు లేదా 29.81 శాతం ఎగిసింది. అలాగే స్మాల్‌క్యాప్ సూచీ 11,628.13 పాయింట్లు లేదా 27.24 శాతం ఎగబాకింది. ఇదే సమయంలో లార్జ్‌క్యాప్ ఇండెక్స్‌గా పరిగణించే సెన్సెక్స్ 8,476.29 పాయింట్లు లేదా 11.73 శాతమే పెరిగింది.
మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్), ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీల్లోకి పెద్ద ఎత్తున దేశీయ మదుపరుల నుంచి నగదు మొత్తాలు రావడమే ఈ లాభాలకు కారణమని స్టాక్ మార్కెట్ నిపుణులు ఈ ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. పెద్ద షేర్లుండే సెన్సెక్స్ కూడా బాగానే పరుగులు పెట్టిందని, అయితే విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) అమ్మకాలు ప్రభావితం చేశాయని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ ఎండీ సునీల్ న్యాతీ అన్నారు. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 80,898.30 వద్ద ముగిసింది. అలాగే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా మునుపెన్నడూ లేనివిధంగా 48,175.21 వద్ద, 54,617.75 వద్ద నిలిచాయి.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్ విలువ.. గడిచిన ఏడాది కాలంలో 79 శాతం పుంజుకున్నది. గత ఏడాది జూలై 18న బీఎస్ఈలో రూ.620గా ఉన్న ఎల్ఐసీ షేర్.. మంగళవారం (ఈ జూలై 16) రూ.1,109.15 వద్ద స్థిరపడింది. రూ.489.15 పెరిగినైట్టెంది. ప్రత్యర్థి సంస్థలు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ షేర్లతో పోల్చితే చాలా ఎక్కువగా తమ ఇన్వెస్టర్లకు ఎల్ఐసీ లాభాలను పంచడం విశేషం. ఇక హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్ విలువ నిరుడు ఇదే సమయంలో రూ.666.55 వద్ద ఉంటే.. ఇప్పుడు రూ.646.55 వద్ద ఉన్నది. రూ.20 తగ్గింది. అలాగే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్ విలువ 12 శాతమే పెరిగింది. గత ఏడాది జూలై 18న రూ.582గా ఉన్నది. ప్రస్తుతం రూ.654.10 వద్ద ముగిసింది. మరో ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎస్బీఐ లైఫ్ కూడా ఎల్ఐసీతో చూస్తే వెనుకబడింది. గడిచిన ఏడాది కాలంలో రూ.1,314 నుంచి రూ.1,621.20 వరకే పెరిగింది. ఇన్వెస్టర్లకు 23 శాతం రాబడులనే అందించింది.
వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టడం.. బ్లూచిప్ షేర్లకేగాక, చిన్న-మధ్యతరహా సంస్థల షేర్లకూ కలిసొచ్చిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాసహా, ఎన్నో దేశాల స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయంటున్న విశ్లేషకులు.. ఆ ఉత్సాహం భారతీయ స్టాక్ మార్కెట్లలోనూ ఉందంటున్నారు. దీనికితోడు దేశీయ మదుపరుల వద్ద సమృద్ధిగా ఉన్న నగదు నిల్వలు, భారత ఆర్థిక వ్యవస్థకున్న బలమైన మూలాలూ లాభించాయని వారు చెప్తున్నారు. కాగా, ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో పెట్టుబడుల ఉపసంహరణలకే పెద్దపీట వేసిన ఎఫ్ఐఐలు.. ద్వితీయార్ధం (జూలై-డిసెంబర్)లో షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తారన్న అంచనాలున్నాయని నిపుణులు చెప్తుండటం గమనార్హం. దీంతో ఇకపై ఈ ఏడాది సెన్సెక్స్ షేర్లు ఇంకా పుంజుకుంటాయని అంటున్నారు.