హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా ఆరేపల్లి గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తున్నదని, పులి కదలికలను పర్యవేక్షించేందుకు థర్మల్ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్టు అటవీ దళాల ప్రధానాధికారి డాక్టర్ సువర్ణ తెలిపారు. ప్రజలు, పులికి ఎలాంటి హాని జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
పులి కదలికలను గమనించేందుకు థర్మల్ ఇమేజింగ్ డ్రోన్లతో 24 గంటలపాటు నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డ్రోన్ల సమాచారంతో అవసరమైన చోట వెంటనే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు పెట్రోలింగ్ బృందాలను రంగంలోకి దించడంతో పాటు, పుణె నుంచి వచ్చిన నిపుణుల రెస్యూ బృందం కూడా అప్రమత్తంగా ఉన్నట్టు వివరించారు. పులి సహజంగా అటవీ ప్రాంతం వైపు వెళ్లేలా ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని సువర్ణ పేర్కొన్నారు.