ముంబై, మే 16: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేకులు పడ్డాయి. ఐటీ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతోపాటు బ్లూచిప్ సంస్థల షేర్లు నష్టాల్లోకి జారుకోవడం సూచీల పతనానికి ఆజ్యంపోశాయి. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 200.15 పాయింట్లు కోల్పోయి 82,330.59 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 400 పాయింట్ల వరకు నష్టపోయిన సూచీకి చివర్లో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడం భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది. మరో సూచీ నిఫ్టీ కూడా 42.30 పాయింట్లు కోల్పోయి 25,019.80 వద్ద నిలిచింది. దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా 2.81 శాతం నష్టపోయింది. కంపెనీలో సింగ్టెల్ తన వాటాను 1.2 శాతం తగ్గించుకోవడం షేరు పతనానికి ప్రధాన కారణం. దీంతోపాటు హెచ్సీఎల్ టెక్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, లార్సెన్ అండ్ టుబ్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ షేర్లు నష్టపోయాయి.
కానీ, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, టాటా మోటర్స్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయని, ఐటీ, బ్యాంకింగ్, మెటల్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం సూచీల పతనానికి కారణమని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సీ తెలిపారు. రంగాలవారీగా చూస్తే ఇండస్ట్రియల్స్ 1.80 శాతం లాభపడగా, దీంతోపాటు రియల్టీ 1.72 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.63 శాతం, యుటిలిటీ 1.44 శాతం, పవర్ 1.37 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, ఐటీ, టెక్నాలజీ, మెటల్, బ్యాంకింగ్ రంగ సూచీలు నష్టపోయాయి. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 2,876.12 పాయింట్లు లేదా 3.61 శాతం, నిఫ్టీ 1,011.8 పాయింట్లు లేదా 4.21 శాతం చొప్పున పెరిగాయి.
రక్షణ రంగ షేర్లు కదంతొక్కుతున్నాయి. డ్రోన్ల తయారీసంస్థల షేర్లతోపాటు క్షిపణుల, అనుబంధ రంగాల సంస్థల షేర్లు 19 శాతం వరకు లాభపడ్డాయి. పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ షేరు అత్యధికంగా 18.90 శాతం లాభపడగా, డాటా ప్యాటర్న్ 9.25 శాతం, ఆస్ట్రా మైక్రోవేవ్ 7.10 శాతం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 5.40 శాతం, మిశ్రా ధాతు నిగామ్ 4.63 శాతం, భారత్ ఎలక్ట్రానిక్స్ 3.87 శాతం, భారత్ డైనమిక్స్ 1.95 శాతం చొప్పున
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా ఆభరణాల వర్తకులు, స్టాకిస్టులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1,400 ఎగబాకి రూ.96,450 పలికింది. పసిడితోపాటు వెండి ధరలు రూ. 1,000 అధికమై రూ.98 వేలు పలికింది. అంతకుముందు ఇది రూ.97 వేలుగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గినప్పటికీ దేశీయంగా ధరలు పెరగడం విశేషం. ఔన్స్ గోల్డ్ ధర 50.85 డాలర్లు లేదా 1.57 శాతం తగ్గి 3,189.25 డాలర్లకు దిగొచ్చింది.