గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. తీవ్ర ఒడిదొడుకులకు లోనైనా.. మదుపరులు పెట్టుబడులకే మొగ్గారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,341.47 పాయింట్లు ఎగిసి 74,005.94 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 446.80 పాయింట్లు అందుకుని 22,502 దగ్గర నిలిచింది. ఇక శనివారం రెండు దఫాలుగా 1: 45 గంటలపాటు జరిగిన ప్రత్యేక ట్రేడింగ్‌లోనూ ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ప్రాధాన్యత ఇచ్చారు. అయినప్పటికీ ఈ వారం సూచీలు లాభ, నష్టాల మధ్య ఊగిసలాటకు లోను కావచ్చన్న అంచనాలు నిపుణుల నుంచి వస్తున్నాయి. ఈ క్రమంలోనే లాభాల స్వీకరణకే వీలుందన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ సరళి.. ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తున్నదన్న వార్తలు చూస్తూనే ఉన్నాం. ఫలితంగా పెట్టుబడులపై వేచిచూసే ధోరణిని మదుపరులు అవలంభించవచ్చు. అయితే ఆయా రంగాల షేర్లలో పెట్టుబడులకూ దిగే వీలున్నదని మరికొందరు మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఎప్పట్లాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. నిఫ్టీకి 22,300 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,000 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 22,700-22,900 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.