న్యూఢిల్లీ, ఆగస్టు 19: అమెరికాలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు దేశీయ ఎగుమతుల్ని గట్టిగానే ప్రభావితం చేయనున్నాయి. మంగళవారం లోక్‌సభలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జతిన్ ప్రసాద్ ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంతో టారిఫ్‌ల దెబ్బకు ఏర్పడే ప్రభావం లక్షల కోట్ల రూపాయల్లోనే ఉంటుందని స్పష్టమైంది.
2024 ట్రేడ్ వాల్యూ ఆధారంగా దేశీయ వాణిజ్య ఎగుమతుల్లో దాదాపు 48.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.20 లక్షల కోట్లు) విలువైనవి ఇబ్బందుల్లో పడవచ్చన్నది అంచనా. కాగా, అమెరికాతో ట్రేడ్ డీల్‌ను ఆలస్యం చేస్తున్నందుకు 25 శాతం, రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను కొంటున్నందుకుగాను జరిమానాగా మరో 25 శాతం సుంకాలను భారత్‌పై ట్రంప్ ప్రకటించిన సంగతి విదితమే. అయితే ఇందులో సగం (25 శాతం) ఈ నెల 7 నుంచే అమల్లోకి రాగా, మిగతా సగం (25 శాతం) ఈ నెల 27 నుంచి వర్తించనున్నాయి. ఇదే జరిగితే 50 శాతం సుంకాలను భారత్ ఎదుర్కోవాల్సి వస్తుంది.
అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి జరుగుతున్న చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొన్నదా? అంటే అవుననేట్టుగానే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. 6వ విడుత చర్చల్లో భాగంగా ఈ నెల 25న అమెరికా ప్రతినిధులు భారత్‌లో పర్యటించాల్సి ఉన్నది. అయితే ఈ టూర్ రద్దయింది. మళ్లీ ఎప్పుడు జరుగుతుందన్నదానిపై ఇంకా ఎటువంటి స్పష్టతా లేకుండాపోయింది. దీంతో ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ మరింత ముదురుతుందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయిప్పుడు. ఇప్పటికే రష్యాతో క్రూడాయిల్ లావాదేవీలను భారత్ భారీగా జరుపుతోందని గుర్రుగా ఉన్న ట్రంప్.. 25 శాతం టారిఫ్‌లను వేసిన సంగతి విదితమే. ఇక అంతకుముందు విధించిన 25 శాతం సుంకాలపై భారత్ పెదవి విరుస్తున్నది. వాణిజ్య చర్చలు జరుగుతుండగానే.. ప్రతీకార సుంకాలకు దిగడం సరికాదంటున్నది. మొత్తానికి మరో వారం రోజుల్లో ఇంకో 25 శాతం టారిఫ్‌లు పడుతుండగా.. ఇప్పుడీ చర్చలు రద్దు కావడం మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. దీంతో ఇప్పట్లో భారత్‌కు టారిఫ్‌ల నుంచి ఊరట దక్కకపోవచ్చు.
అమెరికా ఒత్తిళ్లను పక్కనబెట్టిన భారత్.. రష్యా నుంచి ముడి చమురును భారీగానే కొన్నది. ఈ నెల ప్రథమార్ధంలో రోజుకు 1.8 మిలియన్ బ్యారెళ్ల చొప్పున దిగుమతి చేసుకున్నది. జూలైలో 1.6 మిలియన్ బ్యారెళ్లుగానే ఉండటం గమనార్హం. దీనిపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. రష్యా చమురు చౌకగా దొరుకుతున్నదని, అందుకే దేశ ప్రయోజనాల దృష్ట్యా మరింతగా కొంటున్నామని వెల్లడించాయి. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపాలంటూ అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో భారత్‌పై మరిన్ని సుంకాలుంటాయన్న అంచనాలైతే ఉన్నాయి. ఇదే జరిగితే మోదీ సర్కారు ఎలా ప్రతిస్పందిస్తుందోనన్నది ఇప్పుడు కీలకంగా మారుతున్నది.
ఈ నెల 27 నుంచి భారతీయ ఎగుమతులపై అమెరికా సుంకాలు మరో 25 శాతం పెరగనుండటంతో.. ఔషధ రంగానికీ ఇబ్బందులు తప్పేలా లేవని ప్రముఖ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. ప్రస్తుతానికైతే దేశీయ ఫార్మాకు సుంకాల నుంచి మినహాయింపు లభిస్తున్నది. కానీ అమెరికా టారిఫ్‌లు 50 శాతానికి పెరిగితే సీన్ మారవచ్చని ఫిచ్ హెచ్చరిస్తుండటం గమనార్హం. అలాగే 50 శాతం సుంకాలు అమలైతే ఆసియా దేశాల్లో అత్యధికంగా అమెరికా టారిఫ్‌లను ఎదుర్కొంటున్న దేశం భారతే అవుతుందని కూడా ఓ ప్రకటనలో ఫిచ్ గుర్తుచేస్తున్నది. ఈ క్రమంలో 2025-26 దేశ వృద్ధి 6.5 శాతానికే పరిమితం కావచ్చన్నది. అంతేగాక భారతీయ కంపెనీల ఆదాయం, లాభాలు కూడా ప్రభావితం కావచ్చని చెప్పింది.