న్యూఢిల్లీ, జనవరి 27: వచ్చే నెల 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వరుసగా 9వసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే అత్యధికసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రకటించిన మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. ఈసారి బడ్జెట్‌తో చిదంబరం రికార్డును సమం చేయనుండగా, మరో రెండుసార్లు ప్రవేశపెడితే మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును అధిగమించనున్నారు. 2019లో భారత తొలి పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా వరుసగా 8సార్లు బడ్జెట్‌ను ప్రకటించారు. ఇందులో 2024 ఫిబ్రవరిలో తెచ్చిన మధ్యంతర బడ్జెట్ కూడా ఉన్నది. అసలు స్వతంత్ర భారతంలో తొలి బడ్జెట్‌ను ఎప్పుడు తెచ్చారు? అత్యధికంగా ఎవరు ప్రకటించారు? ఏయే మార్పులు జరిగాయి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఏటా బడ్జెట్ ముందు నిర్వహించే సంప్రదాయ హల్వా వేడుకను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నార్త్ బ్లాక్‌లో మంగళవారం నిర్వహించింది. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వేడుక.. బడ్జెట్ కూర్పు తుది దశకు చేరుకున్నదనడానికి సంకేతం.
తొలి బడ్జెట్: స్వతంత్ర భారతంలో మొదటి కేంద్ర బడ్జెట్‌ను 1947 నవంబర్ 26న దేశ తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రకటించారు.
అత్యధికసార్లు: జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాన మంత్రులుగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10సార్లు బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 1959-64 మధ్య 6సార్లు, 1967-69 మధ్య 4సార్లు బడ్జెట్‌ను ప్రకటించారు. దేశాయ్ తన తొలి బడ్జెట్‌ను 1959 ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రెండేండ్లూ పూర్తిస్థాయి బడ్జెట్లనే ప్రకటించిన ఆయన.. 1962లో మాత్రం మధ్యంతర బడ్జెట్‌ను తెచ్చారు. 1967లోనూ మరోసారి మధ్యంతర బడ్జెట్‌నే ప్రకటించారు. ఇలా మొత్తం 10సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
చిదంబరం 9సార్లు: మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం 9సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రకటించారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో హెచ్డీ దేవెగౌడ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు 1996 మార్చి 19న చిదంబరం తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1997లో రెండోసారి ప్రకటించగా.. మళ్లీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు 2004-08 మధ్య 5సార్లు తెచ్చారు. ఆ తర్వాత 2013, 2014 సంవత్సరాల్లో 2సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ప్రణబ్-మన్మోహన్: ఆర్థిక మంత్రి హోదాలో ప్రణబ్ ముఖర్జీ 8సార్లు బడ్జెట్‌ను పార్లమెంట్‌లోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో 1982-84 మధ్య 3సార్లు, 2009 ఫిబ్రవరి నుంచి 2012 మార్చి వరకు వరుసగా 5సార్లు ప్రకటించారు. ప్రధాని పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ మన్మోహన్ సింగ్ 1991-95 మధ్య వరుసగా 5సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
సుదీర్ఘ ప్రసంగం: ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2020 ఫిబ్రవరి 1న లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రకటిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. 2 గంటల 40 నిమిషాలు మాట్లాడారు. ఇప్పటిదాకా ఇదే రికార్డు.
స్వల్ప ప్రసంగం: 1977లో హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రకటిస్తూ కేవలం 800 పదాల్లో ప్రసంగాన్ని ముగించారు. ఇప్పటికైతే ఇదే రికార్డు.
సమయం: మొదట్లో ఏటా ఫిబ్రవరి నెల చివరి రోజు (28/29)న బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రకటించడం ఆనవాయితీగా ఉండేది. సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. బ్రిటిష్‌వారి నుంచి మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నేపథ్యంలో చాలా ఏండ్లు వారు అనుసరించిన సమయాల్లోనే భారత్‌లో బడ్జెట్ ప్రకటన సాగింది మరి. బ్రిటిష్ వేసవి కాలం ప్రకారం ఆ దేశం కంటే భారత్ కాలమానం 4:30 గంటలు ముం దుంటుంది. దీంతో భారత్‌లో సాయంత్రం 5 గంటలు అంటే బ్రిటన్‌లో అది మధ్యా హ్నం వేళ. అందుకే ఈ టైంను బ్రిటిషర్లు పాటించేవారు. కానీ 1999 నుంచి ఈ సమయం మారింది. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వ హయాంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్‌ను తొలిసారి ఉదయం 11 గంటలకు ప్రకటించారు. ఆ తర్వాత ఇదే కొనసాగింది.
తేదీ: 2017లో కేంద్ర బడ్జెట్ తేదీని మార్చారు. మోదీ సర్కార్.. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మొదలు పెట్టింది. మార్చి ఆఖర్లోగా బడ్జెట్ ఆమోద ప్రక్రియను ముగిస్తున్నది. ఫలితంగా ఏప్రిల్ 1న ఆరంభమయ్యే ఆర్థిక సంవత్సరం నుంచే ఆచరణలోకి వస్తున్నది. ఫిబ్రవరి ఆఖర్లో బడ్జెట్‌ను ప్రకటించినప్పుడు ఆలస్యమయ్యేది.