Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ): ఫార్మాసిటీ స్థానంలోనే ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సుమారు 1,000 నుంచి 2,000 ఎకరాల స్థలంలో ఈ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేయోచనలో సర్కార్ ఉన్నది. ఇందుకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడితో 10 ఇంటిగ్రేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన బయోఏషియా-2024 సదస్సు సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. ముందుగా వికారాబాద్, మెదక్, నల్గొండలలో ఈ విలేజ్లను ఏర్పాటు చేయనున్నట్లు, ఒక్కో విలేజ్‌ను వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల్లో ఉంటుందని ఆయన తెలిపారు.
అయితే ఈ మూడు జిల్లాల్లో ఒకేచోట 1000ఎకరాల భూమి అందుబాటులో లేదని కలెక్టర్లు తేల్చిచెప్పడంతో రాష్ట్ర సర్కార్ దీనిపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తున్నది. కానీ ఎలాగైన వికారాబాద్‌లో ల్యాండ్ పూలింగ్ పద్ధతిలోనైనా ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. అయితే, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం ఆలస్యం కావడం, భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేదిలేదని స్థానికులు తేల్చిచేప్పడంతోపాటు వారిని చుట్టుముట్టి ఆందోళన నిర్వహించారు. అయినప్పటికీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఫార్మాసిటీ కోసం గతంలో వచ్చిన దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉండటంతో ఆయా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అవసరమైతే 2,000 ఎకరాల వరకైనా ఫార్మా క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అయితే, గతంలో ప్రతిపాదిత ఫార్మాసిటీలో అన్ని రకాల ఔషధ పరిశ్రమల ఏర్పాటునకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించగా, తాజాగా ప్రతిపాదిత ఫార్మా క్లస్టర్లో కాలుష్యం కలిగించే బల్క్‌డ్రగ్ పరిశ్రమలను మినహాయించాలని నిర్ణయించారు.
ఫార్మారంగంలో తెలంగాణ రాష్ర్టానికి, ముఖ్యంగా హైదరాబాద్‌కు ఉన్న ప్రత్యేకతను సుస్థిరం చేసే విధంగా గత బీఆర్ఎస్ సర్కారు రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో సుమారు 14,029ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటునకు ప్రతిపాదించినది తెలిసిందే. మొదటి దశలో 8,900ఎకరాల్లో ఔషధ పరిశ్రమల ఏర్పాటునకు అవసరమైన ప్రణాళికలను కూడా గత ప్రభుత్వం సిద్ధం చేసింది. ఫార్మాసిటీలో సుమారు రూ. 64,000 కోట్ల పెట్టుబడులు, తద్వారా 4.20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనావేసింది.