Tesla Shares | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికతో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షేర్లు పైపైకి దూసుకెళ్లాయి. కొన్ని నెలలుగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్‌కు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ గట్టి మద్దతుదారుగా నిలిచారు. తన విజయంలో ఎలన్ మస్క్ కీలక పాత్ర పోషించారని ట్రంప్ సైతం మెచ్చుకున్నారు. దీంతో బుధవారం అమెరికా మార్కెట్లలో టెస్లా షేర్లు 14 శాతం వృద్ధి చెందాయి. ట్రంప్ హయాంలో మస్క్ సారధ్యంలోని టెస్లా ఈవీ కార్లకు దన్ను లభించినా, ఆల్టర్నేటివ్ ఎనర్జీ వెహికల్స్ కు ఇబ్బందులు తలెత్తుతాయని అంచనా వేస్తున్నారు.
టెస్లా షేర్లు పెరిగితే, అమెరికాలోని ఇతర ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు రివియాన్ 8 శాతం, లుసిడ్ గ్రూప్ నాలుగు శాతం, చైనా కేంద్రంగా పని చేస్తున్న ఎన్ఐఓ 5.3 శాతం నష్ట పోయాయి. అంతకు ముందు మంగళవారం సైతం టెస్లా షేర్లు 3.5 శాతం పుంజుకున్నాయి. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ 10 నుంచి 20 శాతం టారిఫ్ చార్జీలు పెంచుతామని ప్రతిపాదించారు. అమెరికా ఆవల ప్రత్యేకించి చైనాలో తయారు చేసే టెస్లా కార్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఎలన్ మస్క్ కీలక భూమిక పోషించనున్నారు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో జరిగిన ఎన్నికల సభలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలన్ మస్క్‌ను ప్రభుత్వ ఎఫిషియెన్సీ కమిషన్ సారధిగా నియమిస్తానని ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ప్రచారం చేయడమే కాదు.. ట్రంప్ అభ్యర్థిత్వ ప్రచారం కోసం అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ (పీఏసీ)కి గత నెలలో ఎలన్ మస్క్ సుమారు 75 మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవ్వడంతో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఎలన్ మస్క్ కీలకం కానున్నారు.