న్యూఢిల్లీ, ఆగస్టు 13: స్పామ్ కాల్స్‌తో ఇబ్బందులు పడుతున్నవారికి భారీ ఊరట లభించినట్లు అయింది. వీటిని నియంత్రించడానికి టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ ఇప్పటికే నడుం బిగించగా..తాజాగా వీటికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజిస్టర్ కానీ టెలి మార్కెట్ సేవలు అందిస్తున్న సంస్థల నుంచి వచ్చే కాల్స్‌ను వెంటనే నిలిపివేయాలని టెలికం సంస్థలకు ట్రాయ్ స్పష్టంచేసింది. ప్రమోషనల్, ప్రీ రికార్డెడ్, కంప్యూటర్ జనరేటెడ్ కాల్స్‌ను వెంటనే నిలిపివేసేతే ఆదేశాలు అమలు చేయాలని, దీనిపై క్ర మం తప్పకుండా నివేదిక అందచేయాలని ఆదేశించింది. ప్రతినెల 1న, 16వ తేదీన ఇందుకు సంబంధించి డాటాను సమర్పించాలని సూచించింది. స్పామ్ కాల్స్‌పై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రాయ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై రెండేండ్ల పాటు యాక్సెస్‌ను నిలిపివేస్తామని, బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించింది. స్పామ్ కాల్స్‌పై గత వారం బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలి సర్వీసెస్ తదితర టెలికం కంపెనీల చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్లతో ట్రాయ్ చీఫ్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలు వెలువడటం గమనార్హం.