TRAI | న్యూఢిల్లీ, జూలై 26: మొబైల్ రీచార్జ్ ప్లాన్ల సమీక్షకు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ శుక్రవారం ఓ కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది. వాయిస్ కాల్స్, డాటా, ఎస్ఎంఎస్ల కోసం సపరేట్ రీచార్జ్ వోచర్లు.. ఇలా అన్నింటిపైనా ఈ పేపర్‌ను తీసుకొచ్చింది.
ఈ ‘టెలికం కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ (టీసీపీఆర్) 2012 రివ్యూపై కన్సల్టేషన్ పేపర్’లో స్పెషల్ టారీఫ్ వోచర్లు (ఎస్టీవీలు), కాంబో వోచర్ల (సీవీలు) గరిష్ఠ పరిమితిని ప్రస్తుతమున్న 90 రోజుల నుంచి ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని కూడా టెలికం సంస్థలకు ట్రాయ్ సూచించింది. అయితే అన్ని టెలికం కంపెనీలు ప్రస్తుతం డాటా, వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లతో కూడిన బండిల్ ప్లాన్లను విరివిగా అమలు చేస్తున్న నేపథ్యంలో ట్రాయ్ చేసిన ఈ సూచనలు ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.
మొబైల్ వినియోగదారుల్లో చాలామంది తమ ప్లాన్‌లో డాటా వృథా అయిపోతున్నదని బాధపడిపోతున్నారు. అందుకే ట్రాయ్ పైవిధంగా టెలికం సంస్థలకు సూచించిందంటున్నారు. కాగా, ఈ కన్సల్టేషన్ పేపర్‌పై వచ్చే నెల 16లోగా అభిప్రాయాలను చెప్పాలని, 23కల్లా అభ్యంతరాలుంటే తెలియపర్చాలని టెలికం సంస్థలకు ట్రాయ్ గడువు పెట్టింది.