న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: హౌసింగ్ ప్రాజెక్టులు, ఆవరణల్లో టెలికం మౌలిక సదుపాయాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు తాజాగా టెలికం శాఖ ముసాయిదా మార్గదర్శకాల్ని విడుదల చేసింది. నేషనల్ బిల్డింగ్ కోడ్, మోడల్ బిల్డింగ్ బై-లాస్లో మార్పులు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా హౌసింగ్ ప్రాజెక్టుల్లో టెలికం ఇన్ఫ్రా ఏర్పాటును తప్పనిసరి చేయాలన్నది ప్రతిపాదన. 5జీ నెట్‌వర్క్‌కు ఇది అవసరమని టెలికం ఆపరేటర్లు అభ్యర్థించిన మేరకు ఈ మార్గదర్శకాలు రూపుదిద్దుకున్నాయి.
5జీ తరంగాలు హైస్పీడ్‌తో ప్రయాణించడమే కాకుండా స్వల్ప దూరాల్ని కవర్ చేయాల్సి ఉంటుంది. దీంతో 5జీ సైట్స్‌ను టెలికం ఆపరేటర్లు గ్రౌండ్‌కు చేరువలో ఏర్పాటు చేయాలి. 2జీ, 3జీ, 4జీల్లా కాకుండా 5జీకి యాక్సెస్ పాయింట్లు..డివైసెస్‌కు దగ్గరగా ఉండాలని టెలికం శాఖ వివరించింది. ఈ కారణంగా హౌసింగ్ ప్రాజెక్టులు, ఆవరణల్లో కేబుల్స్ వేయడం, టెలికం మౌలిక పరికరాల్ని అమర్చడం తప్పనిసరి చేయాలని ప్రతిపాదిస్తున్నట్టు శాఖ తెలిపింది. అలాగే వ్యక్తి, సంస్థ, స్థానిక ప్రభుత్వం నెలకొల్పిన ఎలక్ట్రిక్ పోల్స్, ట్రాఫిక్ లైట్లు, బిల్ బోర్డులు తదితర స్ట్రీట్ ఫర్నీచర్‌పై ఆప్టిప్ ఫైబర్ కేబుల్, స్మాల్ సెల్స్ అమర్చడానికి వసూలు చేసే రుసుం, పరిహారాన్ని రద్దు చేయాలని టెలికం శాఖ ముసాయిదా మార్గదర్శకాల్లో ప్రతిపాదించారు. టెలికం మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేసే సంస్థ ఏ యంత్రాంగం నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని అందులో పేర్కొన్నారు.