Data Storage | ఇక నుంచి మొబైల్ ఫోన్ల కాల్ డేటా, ఇంటర్నెట్ వినియోగ సమాచారం భద్రపరిచే సమయాన్ని కేంద్రం పొడిగించింది. సెక్యూరిటీ కారణాల వల్ల ఈ వివరాలను రెండేండ్లు నిల్వ ఉంచాలని టెలికం ప్రొవైడర్లకు కేంద్ర టెలికంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు ఏడాది కాలం వరకు మాత్రమే మొబైల్ ఫోన్ల కాల్ డేటా, ఇంటర్నెట్ యూసేజీ సమాచారాన్ని టెలికం సంస్థలు స్టోర్ చేస్తూ వచ్చాయి.
రెండేండ్ల తర్వాత కూడా టెలికంశాఖ నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోతే ఆ కాల్ డేటా, ఇంటర్నెట్ యూసేజ్ సమాచారం తొలగించొచ్చునని పేర్కొంది. దీని ప్రకారం టెలికం సంస్థలు తమ సబ్స్క్రైబర్ల లాగిన్, లాగౌట్ వంటి వివరాల్ని రెండేండ్లు స్టోర్ చేయాలి. ఈమెయిల్, మొబైల్ అప్లికేషన్ల కాల్స్, ఇతర యాప్లలోకి లాగిన్ తదితర వివరాలన్నీ నిల్వ చేయాల్సిందే.