Minister Sridhar Babu | హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): వచ్చే రెండు నెలల్లో లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించే అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఫార్మా హబ్‌గా కొనసాగుతున్న తెలంగాణలో లైఫ్ సెన్సెస్కు సంబంధించిన దేశ, విదేశీ కంపెనీలను ఆకట్టుకోవడానికే ఇదన్నారు. దేశంలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కొత్త కంపెనీలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారిపోయిందని, ఇదే ఒరవడిని కొనసాగించడానికి పెట్టుబడులను ఆకర్శించడానికి ప్రత్యేక పాలసీని రూపొందిస్తున్నట్లు తెలిపారు.
గత పది నెలల్లోనే రాష్ట్ర లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో రూ.36 వేల కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఒకేచోట కాకుండా పలు ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఆధునిక కాలుష్య నియంత్రణతో ప్లాంట్లు ఏర్పాటుచేసేలా సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.
ఫార్మా క్లస్టర్ల భూ సేకరణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నదని శ్రీధర్‌బాబు వెల్లడించారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి, వారు అంగీకరించిన తర్వాతే పనులు చేపడతామని, సమస్యలేమైనా ఉంటే రైతులు అధికారులకు తెలియ జేయాలని శ్రీధర్‌బాబు కోరారు.