హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రగతి అద్భుతమని, వ్యాపార-పారిశ్రామిక రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూత గొప్పగా ఉన్నదని నీతి ఆయోగ్ మాజీ సీఈవో, జీ-20లో భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ కొనియాడారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఫ్లో) ఆధ్వర్యంలో బుధవారం నార్సింగిలోని అడ్రస్ కన్వెన్షన్స్‌లో ఏర్పాటుచేసిన అవార్డుల కార్యక్రమంలో కాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో విశేష ప్రగతిని సాధిస్తున్నదని, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇక్కడి ప్రభుత్వం చేస్తున్న కృషి అనిర్వచనీయమంటూ ప్రశంసించారు. ‘మహిళల కోసం వీ-హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు గతంలో మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ఇటీవల తాను వీ-హబ్‌ను సందర్శించినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. దేశంలో బహుషా ఇదే మొదటి వీ-హబ్ అనుకుంటా. మహిళలకు ప్రత్యేకంగా ఓ ఇండస్ట్రియల్ పార్క్‌నే ఏర్పాటు చేయడం కూడా ఎంతో గొప్ప విషయం. ఇటువంటి పారిశ్రామికవాడ దేశంలోనే మొదటిది’ అని ఆనందం వ్యక్తం చేశారు. కాగా, జీ-20కి భారత్ నేతృత్వం వహిస్తున్న ప్రస్తుత సందర్భంలో మహిళా పారిశ్రామికవేత్తలు అందివచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్న ఆకాంక్షను కాంత్ వెలిబుచ్చారు. దేశాభివృద్ధిలో మహిళలను కూడా మరింతగా భాగస్వాములను చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
పెట్టుబడిదారులు హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలపైనా దృష్టి సారించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు కోరారు. తెలంగాణలోని ఏ మారుమూల ప్రాంతం నుంచైనా రెండు-రెండున్నర గంటల్లో హైదరాబాద్‌కు చేరుకోవచ్చని, అందుకే ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ జిల్లాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఆహారశుద్ధి మండళ్లలో మూడింట ఒక వంతు మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించాలని నిర్ణయించామన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ అవార్డుల కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని అత్యుత్తమ మహిళా పారిశ్రామికవేత్తలకు ఫ్లో బిజినెస్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో కోరిన వెంటనే రాయితీపై పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించామన్నారు. అన్నిరకాల సహకారం అందించామని, ఇంకా చేయాల్సి ఉందన్నారు.
జీవనయోగ్య నగరాల్లో హైదరాబాద్..
హైదరాబాద్ నార్త్, సౌత్ ఇండియా కాదని, ఇక్కడ అన్నిరకాల ఆహార పదార్థాలు లభిస్తాయన్నారు. మెసర్ ఇండెక్స్‌లో లివబులిటీ సిటీల జాబితాలో 2015 నుంచి 2020 వరకు వరుసగా ఐదేండ్లపాటు ప్రథమ స్థానంలో ఉందన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఐదు రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని, వీటిలో గ్రీన్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్ ఉన్నట్టు వివరించారు.
లైఫ్ సైన్సెస్ రంగంలోనూ..
లైఫ్ సైన్సెస్ రంగంలోనూ తెలంగాణ తనదైన ముద్ర వేసుకున్నదని, ఇక్కడినుంచే తొమ్మిది బిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను ఎగుమతి చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. నేడు తెలంగాణ.. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియానే కాకుండా, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్‌గా ఎదిగిందన్నారు. ఐటీ, హెల్త్‌కేర్ రంగాల్లోనూ ఎంతో పురోగతి సాధిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు తెలంగాణలో తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయన్నారు. వీ-హబ్‌ను ఏర్పాటు చేశామని, ఇది దేశంలోనే మొదటిదన్నారు. ఇక్కడ కొత్త ఆలోచనలతో వచ్చే ఔత్సాహికులకు తగిన అవకాశాలు కల్పిస్తున్నట్టు కేటీఆర్ వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రభు త్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఫ్లో జాతీయ ప్రెసిడెంట్ జయంతీ దాల్మియా, హైదరాబాద్ విభాగం ఛైర్పర్సన్ సునాలీ షరాఫ్, ఫ్లో మాజీ ఛైర్పర్సన్ పింకీరెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, యుకే డిప్యూటీ హైకమిషనర్ పాల్గొన్నారు.
ప్రాజెక్టులు, నిధులివ్వండి
కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ ప్రాజెక్టులు, అధికంగా నిధులు వచ్చేలా చూడాలని మంత్రి కేటీఆర్ అమితాబ్ కాంత్‌ను కోరారు. తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రమని, అతితక్కువ సమయంలోనే విజయవంతమైన స్టార్టప్‌గా ఎదిగిందన్నారు. మీ (అమితాబ్‌కాంత్) నేతృత్వంలో దేశం జీ-20 సమ్మిట్‌కు నాయకత్వం వహిస్తున్న ప్రస్తుత సందర్భంలో తెలంగాణ అభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలని కోరారు.
ప్రభుత్వ సహకారం మరువలేం
‘మహిళా పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారం మర్చిపోలేనిది. ప్రభుత్వం అభివృద్ధి చేసి, 50 శాతం రాయితీపై భూములను కేటాయించిన సుల్తాన్పూర్ ఫ్లో పారిశ్రామిక వాడలో ప్రస్తుతం 25 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అక్కడ ఇప్పటికే రూ.250 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మరిన్ని కంపెనీలూ వచ్చేందుకు మొగ్గు చూపుతు న్నాయి. తాము కోరిన వెంటనే స్పందించి ఈ పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసినందుకు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించడం ద్వారా వారిని మెరుగైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఫ్లో తరఫున కృషి చేస్తున్నాం.
– శుభ్ర మహేశ్వరీ, ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్