హైదరాబాద్, సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): కొత్త స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రారంభమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్‌కు విశేష స్పందన లభించింది. రాష్ట్రం నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి ఔత్సాహికులు టీ హబ్‌లో అవకాశం కోసం పోటీపడ్డారు. స్టార్టప్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త టీహబ్‌ను ఇటీవల ప్రారంభించింది. అంతటితో ఊరుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా ఇన్నోవేటర్ పేరుతో గ్రామ స్థాయిలో ఆవిష్కరణలు ప్రొత్సహించేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థల్లో సైతం ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యతమిచ్చేలా చర్యలు చేపట్టారు. ఫలితంగా పదుల సంఖ్యలో స్టార్టప్ ఇంక్యుబేటర్లు ఏర్పాటయ్యాయి.
రంగాలవారీగా స్టార్టప్ వేదికలు…
మొదట టెక్నాలజీ రంగానికి సంబంధించిన స్టార్టప్‌లు ఎక్కువగా రాగా, క్రమేణా ఇతర రంగాల్లో ఆవిష్కరణలు మరింత విసృతమయ్యాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఆయా రంగాల వారిగా స్టార్టప్ ఇంక్యుబేటర్లను సంబంధిత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేశారు. టీ హబ్ తర్వాత మహిళల కోసం వీ హబ్, బయో, ఫార్మా రంగాలకు సంబంధించి బయో హబ్ ఉండగా, గచ్చిబౌలి త్రిపుల్ ఐటీలో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూషిప్), ఐఎస్బీతో డీల్యాబ్స్, జేఎన్టీయూలో జే హబ్, శామీర్‌పేటలోని ఐకేపీ పార్కులో లైఫ్ సైన్సెస్ ఇంక్యుబేటర్, సీఎస్ఆర్ ఐఐసీటీలో సొసైటీ ఫర్ బయోటెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్, రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోఅగ్రిహబ్ను ఏర్పాటు చేయడగా, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సైతం తమ రంగాలకు సంబంధించి స్టార్టప్‌లను ప్రోత్సహించేలా హబ్‌లను ఏర్పాటు చేశాయి. ఇలా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్థానిక, జాతీయ విద్యా సంబంధిత పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రాల్లో స్టార్టప్‌లను ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నారు.
తెలంగాణ పేరుతో వెబ్సైట్…
స్టార్టప్ ఎకోసిస్టంను హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా స్టార్టప్ తెలంగాణ పేరుతో ప్రభుత్వం (<\<>https://startup. telangana. gov.in)>> వెబ్సైట్ ఆవిష్కరించింది. ప్రభుత్వం స్టార్టప్‌ల విషయంలో తీసుకుంటున్న చొరవ ఔత్సాహికులకు తెలంగాణ అత్యుత్తమ వేదికగా మారనుంది. పట్నం నుంచి గ్రామాల వరకు సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్‌ను ఏర్పాటు చేసి, దానికి ప్రత్యేకంగా అధికారులను నియమించి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇలా స్టార్టప్‌ల విషయంలో దేశంలో మరే రాష్ట్రం చూపని చొరవ తెలంగాణ చూపిస్తుండడం వల్లే వేలాది స్టార్టప్‌లు ఇక్కడి నుంచే పుట్టుకు వస్తున్నాయి.
ఉద్యోగాల కల్పన…
నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా, కొత్తగా ఉద్యోగాలను స్పష్టించేందుకు స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో స్టార్టప్‌లకు కావాల్సిన అన్నీ వనరులు ఉన్నాయి. కావాల్సిందల్లా ఒక మంచి ఆలోచన, దాన్ని ఒక వ్యాపార వస్తువుగా తీర్చిదిద్దే కృషి,పట్టుదలే కీలకం. అందుకు ఇదే మంచి సమయంగా స్టార్టప్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీ నుంచి మొదలు కొని వివిధ రంగాలకు సంబంధించి స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ఇంక్యుబేటర్లు అందుబాటులో ఉన్నాయి.