తెలంగాణలో మరో సంచలనం పురుడు పోసుకున్నది. ఆది నుంచి సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు దేశంలోనే తొలి రోబోటిక్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించింది. భవిష్యత్తు తరాల ఉన్నతికి.. కీలక రంగాల అభ్యున్నతికి.. మెరుగైన సమాజ నిర్మాణానికి.. ప్రపంచ వేదికపై అటు దేశానికి, ఇటు రాష్ర్టానికి వన్నె తెచ్చేలా ఓ ప్రగతిదాయక విధానాన్ని అందించింది.
‘దేశ, విదేశీ అవసరాలను తీర్చేలా భారత్‌లో రోబోల తయారీని తప్పక చేపట్టాల్సిన అవసరం ఉన్నది. రోబోటిక్స్ రంగంలో కొత్త ఆవిషరణలను తీసుకురావడంతోపాటు వ్యవస్థాపకత, పరిశోధన, అభివృద్ధికి మద్దతునిచ్చేలా స్థిరమైన రోబోటిక్స్ ఎకోసిస్టమ్‌ను రూపొందించాలి. రోబోటిక్స్ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడమే ఈ ఫ్రేమ్‌వర్క్ ప్రధాన లక్ష్యం’
-కేటీ రామారావు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
Robotics Framework | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): ఇప్పటిదాకా ఎన్నో రంగాలకు ప్రధాన కేంద్రంగా భాసిల్లుతున్న తెలంగాణ.. ఇక రోబోటిక్స్కూ కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నది. దేశంలోనే తొలి రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్వారా రేపటి తరాన్ని అన్ని తానై నడిపించే రోబోటిక్స్ టెక్నాలజీని.. ఇప్పుడే నేటి తరానికి కానుకగా అందించింది. మంగళవారం టీ-హబ్‌లో రాష్ట్ర ఐటీ శాఖ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘సాంకేతిక పరిజ్ఞానం ఓ సామాజిక అవసరం. దీనికి జీవితాలను మార్చగల శక్తి ఉన్నది. అందుకే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలకు దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత ప్రాధాన్యతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది’ అని అన్నారు.
‘ప్రస్తుతం మనమంతా వేగవంతమైన సాంకేతిక పురోగమనాల యుగంలో జీవిస్తున్నాం. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట సరికొత్తగా ఆవిష్కరణలు జరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం మనం జీవించే, పనిచేసే, ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానాన్నే సమూలంగా మార్చేసింది. యావత్తు ప్రపంచాన్ని ఒక చిన్న ప్రదేశంగా మార్చేసి, జన జీవనాన్ని ఎంతో దగ్గర చేసింది’ అని తెలిపారు. అలాగే రాష్ట్రం ఏర్పాటైన దగ్గర్నుంచే రాష్ట్ర ప్రగతిలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించామని, ఈ క్రమంలోనే 2017లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్‌ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ‘స్టార్టప్‌ల స్టేట్’గా గుర్తింపు పొందిందన్నారు. ఇక్కడి ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామని, అందుకు తాను గర్వపడుతున్నానని చెప్పారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని నేను నమ్ముతున్నాను. సాంకేతికతను సరైన మార్గంలో ఉపయోగించడం వల్ల మనం గ్లోబల్ లీడర్‌గా ఎదగడానికి మంచి అవకాశం లభిస్తుంది’ అన్నారు.
దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం చేయనివిధంగా తెలంగాణ ప్రభుత్వం.. 8 కొత్త టెక్నాలజీలను ఎమర్జింగ్ టెక్నాలజీస్‌గా గుర్తించి ఐటీ శాఖ పరిధిలోనే ఓ కొత్త వింగ్‌ను ఏర్పాటు చేసింది. ఆయా టెక్నాలజీల్లో అపారమైన అనుభవం, పరిజ్ఞానం కలిగిన నిపుణులతో కలిసి పలు ప్రాజెక్టులను చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో కృత్రిమ మేధస్సు (ఏఐ), బ్లాక్‌చెయిన్, డ్రోన్స్, 3డీ ప్రింటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్పేస్ టెక్, క్లౌడ్ కంప్యూటింగ్, రోటోటిక్స్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ టెక్నాలజీలతోనే ఎకోసిస్టమ్‌ను డెవలప్ చేసి, దాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు సేవలు అందించేలా ప్రభుత్వం ప్రాజెక్టులను చేపట్టిందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ ప్రయత్నంలోనే ప్రతి టెక్నాలజీకి ఒక పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రభుత్వం రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. కొత్త టెక్నాలజీలను రూపొందించే ప్రాజెక్టుల్లో వాటి మొదటి వినియోగదారు ప్రభుత్వమేనని చెప్పారు. ఈ ప్రతిఫలాలను సామాన్యులు సైతం అందుకునేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. పీపీపీ ఫ్రేమ్‌వర్క్ (పాలసీ, పార్ట్నర్షిప్, ప్రాజెక్టు) కింద ప్రభుత్వ-ప్రైవేటు కంపెనీలు, స్టార్టప్‌లు, వ్యక్తులతో కలిసి ప్రాజెక్టులు రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే నాస్కామ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి సంస్థలతో కలిసి పనిచేయడంతోపాటు 5 టెక్నాలజీలతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
రోబోటిక్స్ టెక్నాలజీ డౌన్ స్ట్రీమ్ అప్లికేషన్లలో గేమ్ ఛేంజర్‌గా మారింది. రోబోటిక్స్ అనేది పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేయడం మాత్రమే కాకుండా, మనం ఇంతకుముందు చేయలేని పనులను సృజనాత్మకతతో చేయడం ద్వారా ఉత్పాదకతను, ఆవిష్కరణలను కొత్త స్థాయికి తీసుకువెళ్లనున్నది. మెరుగైన భద్రత, కచ్చితత్వం, సామర్థ్యం పెంపు వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే రోబోటిక్స్ టెక్నాలజీని 4 కీలక రంగాల్లో ఎక్కువగా వినియోగించేలా ప్రాథమికంగా గుర్తించినట్టు మంత్రి కేటీఆర్ తెలియజేశారు. రాష్ట్రంలో బలమైన రోబోటిక్స్ ఎకోసిస్టమ్‌ను స్థాపించడం ద్వారా ఆయా రంగాల్లో వృద్ధికి కొత్త మార్గాలను సృష్టించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ రమాదేవి లంక తదితరులు పాల్గొన్నారు.