అభివృద్ధిలో తెలంగాణ శరవేగంగా దూసుకుపోతున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐ-పాస్ పథకం ప్రగతి ఫలాల్ని అందిస్తున్నది. 2014 నుంచి 7 సంవత్సరాల్లో తెలంగాణ రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించింది. ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా మరో 5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి.
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, రియల్టీ తదితర అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా అవతరించింది. వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు, లైవ్‌స్టాక్ రంగాల్లోనూ గణనీయ అభివృద్ధినే సాధించింది. ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఎంఎస్ఎంఈ ఈపీసీ), బిల్‌మార్ట్ ఫిన్‌టెక్ సంయుక్త అధ్యయన నివేదిక వెల్లడైంది. సీఎంఐఈ క్యాపెక్స్ డాటా బేస్ ఆధారంగా పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధిపై ఇటీవల ఈ అధ్యయనం జరిగింది. ఎంఎస్ఎంఈ ఈపీసీ చైర్మన్ డాక్టర్ డీఎస్ రావత్, బిల్‌మార్ట్ ఫిన్‌టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో జిగిష్ సోనగరా గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఈ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా సందర్భంలోనూ తెలంగాణలో పెట్టుబడుల వెల్లువ ఆగలేదని తెలిపారు. టీఎస్ ఐ-పాస్‌లో భాగంగా 38 శాఖల నుంచి కేవలం పది రోజుల్లో అనుమతులు జారీచేయడం ద్వారా తెలంగాణ దేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకుందని చెప్పారు.

వ్యాపారం భేష్
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నదని రావత్, జిగిష్ కొనియాడారు. గడచిన ఏడేండ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడులు, టీఎస్ ఐ-పాస్ ప్రవేశపెట్టడానికి ముందు ఏడేండ్లతో పోల్చుకుంటే ఎంతో అధికమని చెప్పారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ వేగవంతంగా అభివృద్ధి సాధించినట్టు, కరోనా వంటి సంక్షోభాలు తలెత్తినప్పటికీ వెంటనే కోలుకొని అభివృద్ధి వేగాన్ని కొనసాగించినట్టు ప్రశంసించారు.
పెరిగిన తలసరి ఆదాయం
రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కూడా గత ఏడేండ్లలో 125 శాతం పెరిగింది. 2014-15లో రూ.1,24,104 ఉండగా, 2021-22 నాటికి ఇది రూ.2,78,833కి ఎగిసింది. జీఎస్డీపీ సైతం 2014-15లో రూ.5 లక్షల కోట్లుండగా, 2021-22 నాటికి రూ.11.54 లక్షల కోట్లకు ఎగబాకింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం మాత్రం వేగవంతమైన, బలమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది.
వ్యవసాయం ఆకర్షణీయం
తెలంగాణలో వ్యవసాయ, దాని అనుబంధ కార్యకలాపాలు సైతం స్థిరంగా పురోగమిస్తున్నాయి. 2018-19లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 92.75 లక్షల టన్నులుండగా, 2019-20లో 1.11 కోట్ల టన్నులకు పెరిగాయి. 2020-21లో మరో 50 శాతం పెరుగుదల నమోదైంది. సాగుభూమి గణనీయంగా పెరగడంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిలోనూ భారీగా పెరుగుదల చోటుచేసుకున్నది. అయితే తక్కువ విస్తీర్ణంలో వరిసాగు చేయడం వల్ల రాష్ట్ర రబీ విస్తీర్ణం 33.4 శాతం పడిపోయింది.
పౌల్ట్రీ, పాడి పరిశ్రమ పరుగో.. పరుగు
లైవ్‌స్టాక్ రంగంలోనూ గణనీయమైన వృద్ధిని తెలంగాణ సాధించింది. 2021-22లో మాంసం ఉత్పత్తి అత్యధికంగా 8.7 శాతం పెరిగింది. అలాగే గుడ్ల ఉత్పత్తి ఏడు శాతం, పాల ఉత్పత్తి 3.1 శాతం పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రోత్సాహక పథకాల మూలంగా పౌల్ట్రీ, పాడి పరిశ్రమ రంగంలో వృద్ధి నమోదైంది.
ఎంఎస్ఎంఈలకు..
ఇక రాష్ట్రంలో 26.05 లక్షల ఎంఎస్ఎంఈలుండగా, అందులో సూక్ష్మ రంగంలో 25.94 లక్షలు, చిన్నతరహావి 0.10 లక్షలు, మధ్య తరహావి 0.01 లక్షలున్నాయి. వీటి ద్వారా 40లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ, ఎంఎస్ఎంఈ రంగం టెక్నాలజీ, సకాలంలో రుణాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తాజా నివేదిక పేర్కొన్నది. 95 శాతం సూక్ష్మ పరిశ్రమలు సరైన అవగాహన లేకపోవడం, రికార్డులు, జమా ఖర్చులు వంటివి నిర్వహించకపోవడం వల్ల సకాలంలో రుణాలు పొందలేకపోతున్నాయి. ఫిన్‌టెక్ పెట్టుబడి వార్షికంగా 14 శాతం పెరుగుతున్నది. 2020లో ఇది 44 బిలియన్ డాలర్లు దాటగా, ఈ ఏడాది చివరికల్లా 65 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.
బిల్‌మార్ట్-పారిశ్రామిక సంఘాల ఒప్పందం

పారిశ్రామిక రంగం అభివృద్ధికి, పరిశ్రమల్లో సాంకేతిక నైపుణ్యాల ప్రగతికి సహకారం అందించేందుకుగాను ఎంఎస్ఎంఈ ఈపీసీతోపాటు ఇతర ప్రాంతీయ, రాష్ట్రస్థాయి పారిశ్రామిక సంఘాలతో బిల్‌మార్ట్ అవగాహనా ఒప్పందం చేసుకుంది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటికీ అసంపూర్తిగా ఉన్న డాటా కారణంగా ప్రయోజనాలు పొందలేకపోతున్నాయి. దీంతో ఈ డాటా అప్డేట్ చేయడంతోపాటు సాంకేతికత వినియోగంపై తగిన శిక్షణను అందించడం ద్వారా సకాలంలో రుణాలు, ప్రోత్సాహకాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఎంఎస్ఎంఈ ఈపీసీ చైర్మన్ రావత్ అన్నారు. బిల్‌మార్ట్ వ్యవస్థాపకుడు జిగిష్ సొనగర మాట్లాడుతూ.. తమ సంస్థ 2024 నాటికి 100 కోట్ల గంటల నాలెడ్జ్ అప్‌గ్రేడేషన్ ద్వారా కోటి ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ గెయిన్ (గ్రోథ్ అండ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్)ను ప్రారంభించినట్లు చెప్పారు.
