హైదరాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ) : గడిచిన రెండేండ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలోకి రూ.54 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్శించి, గ్లోబల్ లీడర్‌గా తెలంగాణ ఎదిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వెల్లడించారు. దీంతోపాటు లైఫ్ సైన్సెస్, ఔషధ తయారీ, మెడికల్ టెక్నాలజీ, టీకాల ఉత్పత్తి రంగాల్లో కొత్తగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయని బుధవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ బోర్డు సమావేశంలో ఆయన చెప్పారు.
ప్రపంచంలోని అతి పెద్ద 7 లైఫ్ సైన్సెస్ క్లష్టర్లలో హైదరాబాద్ ఒకటిగా నిలిచిందని, దేశంలో ఈ ఘనత సాధించించిన ఒకే ఒక నగరం మనదే కావడం విశేషమన్నారు. 2030 నాటికి రాష్ట్ర లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థను 250 బిలియన్ డాలర్లకు తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, దీంతో ఏషియా లైఫ్ సెన్సెస్ రాజధానిగా తెలంగాణ శిఖరాగ్రానికి చేరుకుంటుందని మంత్రి వివరించారు.