సంగారెడ్డి, జనవరి 3(నమస్తే తెలంగాణ) : తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీలో శుక్రవారం ఇండియా-ఆస్ట్రేలియా క్రిటికల్ మినరల్స్ హబ్ రెండురోజుల సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఖనిజ అన్వేషణ, టెక్నాలజీ బదలాయింపులపై సింగరేణి, ఐఐటీ హైదరాబాద్(ఐఐటీ-హెచ్) మధ్య అధికారిక ఒప్పంద కూడా జరిగింది. ఇందుకు సంబంధించి భట్టి విక్రమార్క సమక్షంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. 2030 నాటికి తెలంగాణలో 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. క్లిష్టమైన ఖనిజాల వెలికితీత కోసం ఇండియా-ఆస్ట్రేలియా కలిసి పనిచేయనుండటం సంతోషంగా ఉన్నదని, రెండు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఖనిజాల వెలికితీతకు స్థిరమైన మైనింగ్ పద్దతులను కొనుగోనాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ఖనిజాల వెలికితీతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.