హైదరాబాద్, ఏప్రిల్ 15: హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ కోసం టెక్నాలజీ కార్పొరేట్లు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 90 శాతం లీజులు వీరివే కావడం గమనార్హం. దేశీయ రియల్ ఎస్టేట్ ప్రధాన కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ దక్షిణాసియా ప్రైవేట్ లిమిటెడ్ ‘సీబీఆర్ఈ ఇండియా ఆఫీస్ ఫిగర్స్ క్యూ1 2022’ పేరుతో తమ తాజా ఆఫీస్ రిపోర్టును శుక్రవారం విడుదల చేసింది. దేశంలో కార్యాలయ స్థలాలకు గిరాకీ పెరిగిందని, నిరుడు జనవరి-మార్చితో పోల్చితే ఈసారి 97 శాతం వృద్ధి నమోదైందని ఈ నివేదికలో సీబీఆర్ఈ పేర్కొన్నది. ఈ క్రమంలోనే 1.14 కోట్ల చదరపు అడుగులకు లీజింగ్ కార్యకలాపాలు చేరాయని చెప్పింది.
14 లక్షల చదరపు అడుగులు
హైదరాబాద్‌లో ఈ మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 14 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీస్ లీజులు జరిగాయి. ఇందులో 12.6 లక్షల చదరపు అడుగుల స్పేస్‌ను టెక్నాలజీ కార్పొరేట్ సంస్థలే తీసుకోవడం విశేషం. మరో 7 శాతం ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లున్నట్టు సీబీఆర్ఈ ఈ సందర్భంగా తెలియజేసింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నైల్లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెద్ద ఎత్తున ఉన్నదని స్పష్టం చేసింది. మొత్తం ఆఫీస్ స్పేస్ లీజుల్లో ఈ మూడు నగరాల వాటానే దాదాపు 70 శాతంగా ఉన్నట్టు చెప్పింది. ఇక సెజ్‌ల్లో హైదరాబాద్‌కు, నాన్-సెజ్‌ల్లో బెంగళూరుకు డిమాండ్ ఉన్నట్టు తాజా నివేదికలో తేలింది.
10 వేల చ.అ.ల్లో అనుమతులు-మౌలిక వసతులు
అనుమతులు, మౌలిక సదుపాయాల ఆధారంగా కార్పొరేట్లు తమ కార్యాలయాలను ఎక్కడ పెట్టాలి అన్నది నిర్ణయించుకుంటున్నారు. పర్యావరణ అనుమతులతోపాటు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, రవాణా సౌకర్యాలు అనుకూలంగా ఉన్న చోట్లకే మొగ్గు చూపుతున్నారని సీబీఆర్ఈ తెలిపింది. టెక్నాలజీ కార్పొరేట్లు హైదరాబాద్ వైపు చూడటం ఇందుకు నిదర్శనంగానే కనిపిస్తున్నది. కాగా, గతంతో చూస్తే భారీ శ్రేణి ఒప్పందాలు దాదాపు 7 శాతంగానే ఉన్నా.. 10వేలకుపైగా చదరపు అడుగుల్లో డీల్స్ పెరిగాయని సీబీఆర్ఈ తెలియజేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆఫీస్ స్పేస్‌కు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్లే ఆకర్షణీయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
‘హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు భారీగా డిమాండ్ కనిపిస్తున్నది. ఇక్కడ కార్యాలయ స్థలాల లీజుకు కార్పొరేట్లు పోటీ పడుతున్నారు. సమీప భవిష్యత్తులోనూ ఈ ఉత్సాహం కొనసాగుతుంది’
-రోమిల్ దూబే, సీబీఆర్ఈ దక్షిణాసియా డైరెక్టర్
‘కరోనా కేసులు, ఆంక్షలు తగ్గుముఖం పట్టడం ఆఫీస్ స్పేస్‌కు మళ్లీ డిమాండ్‌ను తెచ్చిపెట్టింది. ఈ ఏడాది లీజులు మరింతగా పెరగవచ్చని భావిస్తున్నాం’
-అన్షుమన్ మ్యాగజైన్, సీబీఆర్ఈ ఇండియా చైర్మన్
‘దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుండటం కలిసొస్తున్నది. లీజింగ్ కార్యకలాపాలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’
-రామ్ చంద్నానీ, సీబీఆర్ఈ ఇండియా ఎండీ