Dhurandhar 2 |బాలీవుడ్లో సంచలనం సృష్టించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ విజయం తర్వాత ఇప్పుడు దాని సీక్వెల్ ‘ధురంధర్ 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం బాక్సాఫీస్‌తో పాటు ఓటీటీ వేదికలపై కూడా భారీ విజయాన్ని నమోదు చేయడంతో, రెండో భాగంపై అంచనాలు అమాంతం పెరిగాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను నేడు మధ్యాహ్నం 12:12 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో హైప్ మరింత పెరిగింది.ప్రఖ్యాత దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ స్పై ఎంటర్టైనర్లో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించనుండటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. మరోవైపు బాలనటి గా గుర్తింపు పొందిన సారా అర్జున్ ఈ చిత్రంలో ఒక సర్ప్రైజ్ రోల్లో కనిపించనుందని సమాచారం.ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ టీ-సిరీస్ భారీ మొత్తానికి సొంతం చేసుకోవడం విశేషం. టీజర్‌ను కూడా టీ-సిరీస్ అధికారిక యూట్యూబ్ ఛానెల్లోనే విడుదల చేయనున్నారు. దీంతో టీజర్ రిలీజ్ సమయానికి లక్షలాది మంది వీక్షకులు ఆన్లైన్లో చేరే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను పాన్-ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్సులు, స్టైలిష్ స్పై ఎలిమెంట్స్ ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలవనున్నాయని టాక్ వినిపిస్తోంది. ‘ధురంధర్ 2’ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో టీజర్ అనౌన్స్మెంట్ ట్రెండింగ్‌లో ఉండటంతో, విడుదలకు ముందే ఈ సినిమా భారీ క్రేజ్ సంపాదించిందని చెప్పవచ్చు. మొదటి భాగాన్ని మించిన సస్పెన్స్, యాక్షన్, స్టార్‌కాస్ట్‌తో ప్రేక్షకులను మెప్పించేందుకు ‘ధురంధర్ 2’ సిద్ధమవుతోంది.