ఐటీ శాఖకు ముందస్తు సమాచారంతో ప్రయోజనాలు
కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23) మొదలై అప్పుడే నెల కావస్తున్నది. ఈ ఏడాది కాలానికి ట్యాక్స్ ప్లానింగ్ ఇప్పట్నుంచే మొదలు పెట్టాలి. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) మీద వచ్చే వడ్డీపై టీడీఎస్‌ను లేదా పన్ను దాఖలు నుంచి మినహాయింపు పొందాలంటే కొన్ని ఫారాలను ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు సమర్పించాల్సిందే. 12బీబీఏ, 15జీ, 15హెచ్ ఫారాలతో డిక్లరేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెన్షన్, వడ్డీ ఆదాయం మాత్రమే ఉన్న 75 ఏండ్లకుపైబడిన సీనియర్ సిటిజన్లు ఐటీ చట్టంలోని 12బీబీఏ ఫారంతో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ ఫారంను బ్యాంకులోనే సమర్పించవచ్చు. దీంతో ఐటీ రిటర్న్‌లను దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ ఫారాన్ని సమర్పించే ముందు తమకు పింఛన్, వడ్డీ ఆదాయం తప్ప.. మరే ఇతర ఆదాయం లేదన్న విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. అలాగే పింఛన్ జమవుతున్న బ్యాంకులోనే ఈ ఫారంను సమర్పించాలి. 12బీబీఏతోపాటే సెక్షన్ 80సీ, 80డీల కింద ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ డిడక్షన్స్‌ను కూడా అదే ఫారంలో పొందుపర్చాలి. అయితే ఈ ఫారంను సమర్పించడానికి ఎలాంటి గడువు లేదు. కానీ టీడీఎస్ మినహాయించకుండా ఉండాలంటే ముందుగానే ఈ ఫారంను సమర్పించాలి.
15జీ, 15హెచ్ ఫారాలు
పన్ను చెల్లింపుదారులకు వడ్డీ, డివిడెండ్, అద్దె, ఇన్సూరెన్స్ కమిషన్ వంటివి ఎలాంటి టీడీఎస్ మినహాయింపులు లేకుండానే వస్తుంటాయి. ఏటా ఉంటే ప్రాథమిక డిడక్షన్ కాకుండా, ఈ ఆదాయాలపై టీడీఎస్‌ను మినహాయించరాదని కోరేవే ఈ 15జీ, 15హెచ్ ఫారాలు. అయితే తమ ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించే అవసరం లేనప్పుడు మాత్రమే ఈ ఫారాలను సమర్పించాలి. 60 ఏండ్లలోపు వ్యక్తులు, అవిభాజ్య హిందు కుటుంబాలు 15జీ ఫారంను, సీనియర్ సిటిజన్లు 15హెచ్ ఫారంను సమర్పించాలి. వీటిని ఆన్లైన్లో కాకుండా భౌతికంగానే సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఎన్నారైలు సమర్పించడానికి వీల్లేదు.
టీడీఎస్ రూ.25వేలు దాటితే..
ఒకే ఆర్థిక సంవత్సరంలో టీడీఎస్ డిడక్షన్స్ రూ.25,000 దాటితే, ఇకపై తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సిందే. సీనియర్ సిటిజన్లకు ఈ మినహాయింపు రూ.50,000. ఐటీ శాఖ ఎవరెవరు తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయాలో తెలియచేస్తూ ఓ నోటిఫికేషన్‌నూ జారీ చేసింది. వ్యాపార అమ్మకాలు లేదా టర్నోవర్ రూ.60 లక్షలు దాటినా, ప్రొఫెషనల్ సేవల ఆదాయం రూ.10 లక్షలు దాటినా ఐటీఆర్‌ను దాఖలు చేయాలి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ.50 లక్షలకన్నా ఎక్కువగా ఉన్నా, లేదా గత ఆర్థిక సంవత్సరంకన్నా అధికంగా ఉన్నా ఐటీఆర్ తప్పనిసరి.