Term Insurance | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: రాబోయే వస్తు, సేవల పన్ను మండలి (జీఎస్టీ కౌన్సిల్) సమావేశంలో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే ప్రీమియంలపై జీఎస్టీని ఎత్తివేసే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ పాలసీల ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ పడుతున్నది. ఈ నేపథ్యంలో ఎప్పట్నుంచో దీన్ని తొలగించాలని అటు పాలసీదారులు, ఇటు బీమా పరిశ్రమ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
తమకు ఇది ఆర్థిక భారంగా ఉంటున్నదని పాలసీ హోల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 9న జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో ఈ అంశాన్ని పరిశీలించబోతున్నారని సమాచారం. దీంతో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ల ప్రీమియంలపై విధిస్తున్న 18 శాతం జీఎస్టీని తీసేసే వీలుందని భూటా షా అండ్ కో. ఎల్ఎల్పీ పార్ట్నర్ హర్ష భూటా చెప్తున్నారు.
జీవిత బీమా రకాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలదే ఇప్పుడు హవా. ఇతర ఏ మెచ్యూరిటీ ప్రయోజనాలు లేకుండా కేవలం డెత్ బెనిఫిట్ (పాలసీదారు మరణానంతరం వచ్చే ప్రయోజనం) మాత్రమే ఇందులో ఉంటుంది. తక్కువ ఖర్చుతో భారీ మొత్తాలను పాలసీదారులు అందుకునే అవకాశం వీటిలో ఉన్నది. అయితే పాలసీ వ్యవధిలో పాలసీదారుడు చనిపోతేనే బీమా ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఈ బీమాకు ఖర్చు చేసిన మొత్తాలను వదులుకోవాల్సిందే. గడువు దాటితో మళ్లీ కొత్త పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రీమియంల ఆధారంగా పాలసీ ప్రయోజనాలుంటాయి.
ఒకేసారి వేలు, లక్షలు చెల్లిస్తే కోట్లలో పరిహారం లభిస్తుంది. అయితే ఆకస్మిక మరణాలు సంభవించినప్పుడు బాధిత కుటుంబాలకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కొండంత అండగా నిలుస్తున్నది. అందుకే ప్రీమియంలు ఎక్కువైనా వీటినే తీసుకొనేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ ప్రీమియంలపై జీఎస్టీ 18 శాతం ఉండటంతో పాలసీదారులకు, పరిశ్రమకు కొంత ఇబ్బందికరంగా ఉంటున్నది. జీఎస్టీ మినహాయింపు దక్కితే పెద్ద ఎత్తున టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల అమ్మకాలు జరుగుతాయని, అందరికీ బీమా అనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం కూడా త్వరగా నెరవేరుతుందని అంతా అంటున్నారు.
ఇక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను ఇతర లైఫ్ ఇన్సూరెన్స్‌ల తరహాలో పెట్టుబడి కోణంలో చూడవద్దని, కుటుంబ పెద్ద చనిపోతే.. ఆ కుటుంబం రోడ్డునపడకుండా టర్మ్ ఇన్సూరెన్స్ కాపాడుతుందని, వారి భవిష్యత్తు అవసరాలే తప్ప ఇందులో పాలసీదారులకు ఎలాంటి లాభాలకు తావు లేదన్న అభిప్రాయాలూ ఇండస్రీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అందువల్లే జీఎస్టీ మినహాయింపు అంశాన్ని వచ్చే వారం సమావేశంలో కౌన్సిల్ పరిశీలించబోతున్నట్టు చెప్తున్నారు.
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (యులిప్స్)గా ఉన్న ఇతర జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ ఎత్తివేతకు వీలుండకపోవచ్చని కూడా అంటున్నారు. పాలసీదారుడు మరణించినా.. మరణించకపోయినా నిర్ణీత కాలవ్యవధి తర్వాత బీమా ప్రీమియంల సొమ్ము తిరిగి వస్తుందని గుర్తుచేస్తున్నారు. పాలసీదారులకు, వారి కుటుంబ సభ్యులకు బీమా ప్రతిఫలం అందుతుందని, కాబట్టి ఈ మనీ బ్యాక్ పాలసీలన్నింటినీ పెట్టుబడుల కోణంలోనే చూస్తారంటూ వాటిపై 18 శాతం జీఎస్టీ ఇకపైనా కొనసాగుతుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే కొంత మొత్తంలో ఈ పన్ను భారాన్ని తగ్గించవచ్చని, మొత్తంగా మాత్రం తీసేయకపోవచ్చని మరికొందరు అంటున్నారు. కాగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై వసూలు చేస్తున్న 18 శాతం జీఎస్టీని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లు వస్తున్నట్టు గత నెల్లోనే చెప్పారు. వీటిని జీఎస్టీ మండలి సమావేశాల్లో పరిశీలిస్తామని కూడా ఆమె అన్న విషయం తెలిసిందే.