Tax Exemption | వేతన జీవులు ప్రతి ఏటా ఐటీ రిటర్న్స్ సమర్పిస్తూ ఉంటారు. వారే కాదు.. ప్రొఫెషనల్స్ కూడా క్రమం తప్పకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే. ఆ క్రమంలో తాము కష్టపడి సంపాదించిన సొమ్ము ఆదా చేయడానికి గల మార్గాలపై చాలా మంది ఫోకస్ చేస్తుంటారు. అలా గరిష్ట మొత్తంలో పన్ను ఆదా చేయడానికి కొన్ని ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లు ఉన్నాయి. అటువంటి పథకాలకు ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ కింద ఏటా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.
ఇలా పన్ను మినహాయింపు పొందడానికి మాత్రమే కాదు ఇన్వెస్ట్మెంట్లు దీర్ఘకాలికంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు తమ ఆర్థిక ప్రణాళికకు అనుగుణంగా ఉన్న పథకాలను ఎంచుకుంటే.. మీ కుటుంబ దీర్ఘకాలిక లక్ష్యాలను అందుకునేందుకు సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
ఈ పన్ను మినహాయింపు పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆర్థిక సంవత్సరం ముగిసిపోయే వరకు వేచి చూడకుండా ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవాలి. ఫలితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నప్పుడు ఇన్వెస్ట్ మెంట్ పథకాల రసీదులన్నీ ఎటువంటి ఇబ్బందుల్లేకుండా సబ్మిట్ చేయొచ్చు. ఈ పెట్టుబడుల ప్రక్రియ ఏడాది పొడవునా కొనసాగేలా చూసుకోవాలి.
ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్.. అసలు పన్ను మినహాయింపుకు ఎలా ఉపకరిస్తుందో తెలుసుకుందాం.. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్.. వ్యక్తులు, హెచ్యూఎఫ్ ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన కొన్ని పెట్టుబడులపై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. కానీ, కేంద్రం అమల్లోకి తెచ్చిన కొత్త ఆదాయం పన్ను చట్టం ఎంచుకున్న వారు మాత్రం ఈ తగ్గింపు కోసం క్లయిమ్ చేయలేరు.
ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్).. మ్యూచువల్ ఫండ్ పరిధిలోకి వస్తుంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల నుంచి అధిక ఆదాయం పొందడమే లక్ష్యంగా ఈ స్కీమ్ రూపుదిద్దుకున్నది. ఈ తరహా పెట్టుబడులకు మూడేండ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. మార్కెట్ల ఆధారంగా ఈ పథకం పని చేస్తుంది. గత మార్కెట్ల పనితీరును బట్టి వీటిపై 10 నుంచి 13 శాతం ఆదాయం ఉంటుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ మారుతున్నా గరిష్ట పెట్టుబడులకు పరిమితుల్లేవు. ఈ పథకం కింద పెట్టుబడిపై వచ్చే రూ. లక్ష ఆదాయం మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిట్ టాక్స్ రాయితీ ఉంటుంది. డివిడెండ్ ఆదాయం మొత్తం ఆదాయంలో కలుపుతారు. శ్లాబ్ రేట్ ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఐదేండ్ల గడువు గల బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపైనే ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు ఇండియన్ సిటిజన్లు మాత్రమే చేయడానికి నిబంధనలు అనుమతి ఇస్తున్నాయి. బ్యాంకులను బట్టి ఆదాయం 6.5 నుంచి 7.5 శాతం వరకు లభిస్తుంది. కనీసంగా రూ.1000 నుంచి పెట్టుబడి ప్రారంభించొచ్చు. శ్లాబ్ రేట్ ప్రకారం వచ్చిన వడ్డీ ఆదాయంపై ఆదాయం పన్ను వర్తింపజేస్తారు.
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్) ప్రభుత్వ హామీ గల దీర్ఘకాల పెట్టుబడి స్కీం. 15 ఏండ్ల సుదీర్ఘ కాలం పాటు పెట్టుబడి పెట్టాలి. ఇందులో భారతీయ పౌరులు మాత్రమే పెట్టుబడి పెట్టొచ్చు. లాకిన్ పీరియడ్ 15 ఏండ్లు ఉన్నా ప్రతి ఐదేండ్లకోసారి పొడిగించుకోవచ్చు. ఏడేండ్ల తర్వాత మాత్రం పాక్షికంగా విత్ డ్రాయల్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇప్పుడు 7.1 శాతం వడ్డీ వస్తుంది. ప్రతి యేటా కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. పెట్టుబడులు ఉపసంహరిస్తున్నప్పుడు వచ్చే అసలు ప్లస్ వడ్డీపై పన్ను మినహాయింపు ఉంటుంది.
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ ఫండ్ కోసం వారి బేసిక్ పే ప్లస్ డీఏలో 12 శాతం యాజమాన్యం కట్ చేసి.. ఈపీఎఫ్ లేదా ఇతర గుర్తింపు పొందిన ప్రావిడెండ్ ఫండ్ స్కీంల్లో డిపాజిట్ చేస్తారు. ప్రతి నెలా గరిష్టంగా రూ.1500 డిపాజిట్ చేస్తారు. ఉద్యోగం నుంచి వైదొలిగిన రెండు నెలల తర్వాత ఎక్కడా చేరకపోతే వారి పీఎఫ్ మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈపీఎఫ్ మీద 8.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేండ్ల సర్వీసు పూర్తయిన తర్వాత వడ్డీతోపాటు ఈపీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకుంటే మొత్తం ఈపీఎఫ్ మీద పన్ను మినహాయింపు లభిస్తుంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో పెట్టుబడిపై రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు కోసం క్లయిమ్ చేయొచ్చు. ప్రొఫెషనల్స్, అసంఘటిత రంగ కార్మికుల రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందడానికి వీలుగా కేంద్రం ఈ పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద రూ.1.50 లక్షల వరకు ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. 80సీసీడీ (1బీ) సెక్షన్ కింద మరో రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు కోరొచ్చు. ఇందులో 18-60 ఏండ్ల లోపు వారు సభ్యులుగా చేరొచ్చు.
ఇప్పుడు కాసింత మెరుగైన ఆదాయం గల వారు రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. అలా లోన్ తీసుకున్న వారు ఈఎంఐలో అసలుపై ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద మినహాయింపు పొందొచ్చు. ఇల్లు కొనుగోలు చేస్తున్నప్పుడు పే చేసే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇతర ఖర్చులకూ పన్ను మినహాయింపు పొందొచ్చు.
జీవిత బీమా పాలసీ ప్రీమియం మీద కూడా ఆదాయం పన్ను చట్టం 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. అయితే పాలసీ ప్రీమియం బీమా హామీలో 10 శాతానికి మించకూడదు.
అమ్మాయిల భవితవ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. పదేండ్ల వయస్సు గల అమ్మాయి పేరుపై ఈ పథకం కింద ఖాతా తెరవవచ్చు. ఆ బాలిక వయస్సు 18 ఏండ్లు దాటాక సగం విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ పథకం కింద పెట్టుబడిపై రూ.7.60 శాతం వడ్డీ లభిస్తుంది. దీనిపై 80సీ సెక్షన్ కింద రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ మీద పన్ను రాయితీ క్లయిం చేయొచ్చు.