Tata- Semi Conductor Chips | ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు మొదలు కార్ల వరకూ.. ప్రతి వస్తువు టెక్నాలజీ ఫీచర్లతోనే వస్తోంది. ఎలక్ట్రానిక్, టెక్నాలజీ వస్తువులు పని చేయాలంటే సెమీ కండక్టర్ చిప్ లు చాలా కీలకం. ఇప్పటి వరకూ తైవాన్ వంటి దేశాల్లోని కంపెనీలే సెమీ కండక్టర్ల తయారీలో కీలక పాత్ర పోషించాయి. కరోనా మహమ్మారి వేళ ‘వర్క్ ఫ్రం హోం’, ‘లెర్న్ ఫ్రం హోం’ కారణంగా లాప్ టాప్ లు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు మొదలు కార్ల వరకూ అన్నింటిలోనూ వాడే సెమి కండక్టర్లకు కొరత ఏర్పడింది. ఫలితంగా కార్ల తయారీ.. డెలివరీ మధ్య గ్యాప్ నెలకొనడంతో సెమీ కండక్టర్ల తయారీ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సెమీ కండక్టర్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. తదనుగుణంగా దేశీయంగా సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ వేళ్లూనుకునేందుకు మార్గం సుగమమైంది. టాటా గ్రూప్ అనుబంధ టాటా ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు నిర్మాణం అవుతున్నాయి.
ఈశాన్య రాష్ట్రం అసోంలో తొలి సెమీ కండక్టర్ ప్యాక్టరీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ ఫ్యాక్టరీని దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన టాటా గ్రూప్ చేపట్టింది. రూ.27 వేల కోట్ల పెట్టుబడుల అంచనాలతో చిప్ అసెంబ్లింగ్ ప్లాంట్ నిర్మాణం మొదలైంది. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే దేశీయంగా అభివృద్ధి చెందిన టెక్నాలజీతో రోజూ 4.83 కోట్ల చిప్‌లు తయారు చేయొచ్చు. వచ్చే ఏడాది నాటికి ఈ ఫ్యాక్టరీ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు. చిప్‌ల తయారీ మొదలైతే ప్రారంభంలోనే 27 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.
టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం మోరిగావ్ జిల్లాలోని జాగిరోడ్డులోని ప్రాజెక్టు సైట్ వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడుతూ ఇప్పటికే అసోం నుంచి వెయ్యి మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు తెలిపారు. తమ కంపెనీ యావత్ సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ కంపెనీల విస్తరణకు వసతులు కల్పిస్తుందన్నారు.
ప్రత్యక్షంగా 15 వేల మంది, పరోక్షంగా 12 వేల మందికి ఉపాధి లభిస్తుందని చంద్రశేఖరన్ తెలిపారు. శరవేగంగా పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, 2025లో కంపెనీ ఆపరేషన్స్ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు గత ఫిబ్రవరి 29న ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన ఐదు నెలల్లోనే కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. టాటా చిప్స్ తయారీ ఫ్యాక్టరీ తయారు చేసే చిప్ లను ఎలక్ట్రిక్ వెహికల్స్ తోపాటు అన్ని వాహనాల్లో వాడవచ్చునన్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి ఈశాన్య రాష్ట్రాల్లోనే తొమ్మిది సంస్థలు పని చేస్తున్నాయన్నారు.
ఎన్ఐటీ సిల్చార్, ఎన్ఐటీ మిజోరం, ఎన్ఐటీ మణిపూర్, ఎన్ఐటీ నాగాలాండ్, ఎన్ఐటీ త్రిపుర, ఎన్ఐటీ అగర్తల, ఎన్ఐటీ సిక్కిం, ఎన్ఐటీ అరుణాచల్ ప్రదేశ్ తోపాటు మేఘాలయలోని నార్త్ ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీ, ఎన్ఐటీ సంస్థలు సెమీ కండక్టర్ పరిశ్రమకు అవసరమైన ప్రతిభావంతుల తయారీలో నిమగ్నం అయ్యాయి. మొత్తం 85 వేల మంది నిపుణులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది కేంద్ర ప్రభుత్వం.
Citroen Basalt | సిట్రోన్ బసాల్ట్ ఎస్యూవీ కూపే ఆవిష్కరణ.. ఇవీ డిటెయిల్స్.. !
Hyundai Venue | హ్యుండాయ్ వెన్యూ అప్ డేటెడ్ వర్షన్ వెన్యూ ఎస్ (ఓ)+.. ధరెంతంటే..?!
World Bank – India | ప్రపంచ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు.. భారత్ ఆ స్థాయికి చేరుకోవాలంటే..!