TataPunch NewRecord | కరోనా తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో ఎంట్రీ లెవెల్, హ్యాచ్‌బ్యాక్ క్యాటగిరీ కార్లకు గిరాకీ ఉండేది. ఇప్పుడు అంతా ఎస్యూవీ కారుపైనే మోజు పెంచుకున్నారు. కస్టమర్ల ఆకాంక్షలను గుర్తించిన మారుతి సుజుకి, మహీంద్రా, హ్యుండాయ్.. టాటా మోటార్స్ వంటి సంస్థలు ఎస్యూవీలపైనే దృష్టి పెట్టాయి. తాజాగా మారుతి, హ్యుండాయ్లతో పోటీ పడుతున్న టాటా మోటార్స్ గురువారం అరుదైన రికార్డు నమోదు చేసింది. ఆ సంస్థ ఎస్యూవీ కంపాక్ట్ మోడల్ కారు పంచ్ 1,00,000వ యూనిట్‌ను పుణె నుంచి కస్టమర్‌కు డెలివరీ చేసింది. మార్కెట్లో ఆవిష్కరించిన పది నెలల్లోనే లక్ష కార్ల విక్రయ మైలురాయికి చేరుకున్నది టాటా పంచ్. శరవేగంగా ఈ మార్క్‌ను అధిగమించిన వేరియంట్‌గా నిలిచింది. ఇక గ్లోబల్ ఎన్-క్యాప్ సేఫ్టీ రేటింగ్‌లో 5-స్టార్ అందుకున్నది. అందుకే కస్టమర్ల నుంచి టాటా పంచ్ కోసం డిమాండ్ పెరిగిపోయింది.
గతేడాది అక్టోబర్‌లో టాటా పంచ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది టాటా మోటార్స్. నాటి నుంచి దేశంలోని బెస్ట్ సెల్లింగ్ టాప్-10 కార్లలో టాటా పంచ్ చోటు దక్కించుకుంటూనే ఉన్నది. గత జూలైలో అత్యధికంగా 11,007 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఎస్‌యూవీల విభాగంలో అత్యధిక రికార్డు అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేశ్ చంద్ర చెప్పారు. టాటా పంచ్ ఈ మైలురాయిని చేరుకోవడంతో ఎస్యూవీ కార్ల పట్ల కస్టమర్ల డిమాండ్‌కు ప్రతిబింబంగా నిలిచిందన్నారు.
టాటా పంచ్ కంపాక్ట్ ఎస్యూవీ 1.2 లీటర్ల పెట్రోల్ సామర్థ్యం గల ఇంజిన్‌తో రూపుదిద్దుకున్నది. ఇది 86 పీఎస్ విద్యుత్, 113 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. మాన్యువల్ గేర్ బాక్స్‌తో కూడిన ఇంజిన్ లీటర్ పెట్రోల్‌పై 18.82 కి.మీ. మైలేజీనిస్తే ఏఎంటీ ట్రాన్సిమిషన్ ఇంజిన్ 18.97 కి.మీ మైలేజీ అందిస్తుంది.
ఏడంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ హెడ్‌లైట్స్, కనెక్టెడ్ కార్ టెక్, ఆటో ఏసీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో ఫోల్డ్ ఓఆర్వీఎంతోపాటు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ జత కలిశాయి. ఐఆర్ఏ (iRA Connected Car) కనెక్టెడ్ కారు టెక్నాలజీతోపాటు 25కు పైగా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
టాటా పంచ్ ఎస్యూవీ కారు నాలుగు వేరియంట్లలో లభ్యం అవుతుంది. ప్యూర్, అడ్వెంచర్ పర్సనా, ఎకంప్లిష్డ్, క్రియేటివ్ వేరియంట్లలో లభించే టాటా పంచ్ 8 కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. మహీంద్రా కేయూవీ100, మారుతి సుజుకి ఇగ్నిస్ వంటి కార్లతో టాటా పంచ్ తలపడుతున్నది.