TPREL | 200 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన (RE) ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు ఎన్టీపీసీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటాపవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) సోమవారం తెలిపింది. ఈ ప్రాజెక్టు 24 నెలల్లో పూర్తవుతుందని.. సంవత్సరానికి 1,300 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తుందని.. ఏడాదికి మిలియన్ టన్నుల కార్బన ఉద్గారాలను తగ్గిస్తుందని ఓ టాటా పవర్ పేర్కొంది. సోలార్, విండ్, బీఈఎస్ఎస్ టెక్నాలజీలతో కూడిన ఈ ప్రాజెక్టును కాంపిటీటివ్ బిడ్డింగ్ ఆధారంగా టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ దక్కించుకుంది.
డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పెరుగుతున్న ఇంధన అవసరాలకు మద్దతు ఇచ్చేందుకు, 4 గంటల గరిష్ట విద్యుత్ సరఫరాకు కట్టుబడి ఉండటం, పీక్ డిమాండ్ సమయాల్లో కనీసం 90 శాతం లభ్యతను నిర్ధారించడం లక్ష్యమని పేర్కొంది. ఈ ప్రాజెక్టుతో టీపీఆర్ఈఎల్ మొత్తం పునరుత్పాదక వినియోగ సామర్థ్యం 10.9 గిగావాట్లకు చేరింది. ప్రస్తుతం 4.5 గిగావాట్ల సోలార్, ఒక గిగావాట్ పవన విద్యుత్ కలిపి 5.5 గిగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తోంది. మిగతా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా.. ఆయా ప్రాజెక్టులను వచ్చే ఆరు నుంచి 24 నెలల్లో దశలవారీగా పూర్తి చేయాలని భావిస్తున్నది.