ముంబై, జూన్ 21: దేశంలో అత్యంత ఆకర్షణీయ కంపెనీగా టాటా పవర్ నిలిచింది. హెచ్ఆర్ సేవల సంస్థ రాండ్‌స్టడ్ ఇండియా బుధవారం విడుదల చేసిన తమ వార్షిక నివేదిక ‘రాండ్‌స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రిసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2023’లో టాటా పవర్ అగ్రస్థానంలో ఉన్నది. తర్వాతి స్థానాల్లో వరుసగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, టాటా గ్రూప్‌నకే చెందిన టాటా స్టీల్ ఉన్నాయి. ఆర్థిక పరిపుష్ఠి, పరపతి, ఉద్యోగుల పదోన్నతులు, అవకాశాల ఆధారంగా టాటా పవర్ భారీ స్కోర్‌ను సాధించినట్టు రాండ్‌స్టడ్ తెలియజేసింది. గత ఏడాది నివేదికలో ఇది 9వ స్థానంలో ఉండటం గమనార్హం. కాగా, వృత్తిగత-వ్యక్తిగత జీవితం బ్యాలెన్స్, ఆకర్షణీయ వేతనం, ఇతర ప్రయోజనాల ప్రాతిపదికన ఉద్యోగులు ఆయా సంస్థలకు ఓటేశారు. ఇక ఆఫీస్, హోం లైఫ్ బ్యాలెన్స్‌లో మహిళలు తెలివిగా వ్యవహరిస్తున్నట్టు తేలింది.