హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వైద్య విద్యను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాలికి వదిలేసింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయగా.. నేడు ఆ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. దీనిపై తాజాగా తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ (టీఎస్ఆర్డీఏ) చేసిన సర్వేలో సంచలన వెలుగు చూశాయి. రాష్ట్రంలో మొత్తం 36 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం ప్రతి 100 మంది మెడికల్ విద్యార్థులకు ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు సీనియర్ రెసిడెంట్స్ ఉండాలి. కానీ, రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో మొత్తం 27 విభాగాల్లో జీరో టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నట్టు టీఎస్ఆర్డీఏ సర్వేలో తేలింది. ప్రధానంగా జోగుళాంబ గద్వాల, ఆసిఫాబాద్, కొడంగల్, భూపాలపల్లి, నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ సమస్య తీవ్రస్థాయిలో ఉన్నట్టు వెల్లడైంది.
150 విభాగాల్లో ఫ్యాకల్టీ లేకుండానే
మన కాలేజీల్లోని 150 విభాగాల్లో సీనియర్ ఫ్యాకల్టీ లేదని, ఆయా విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు మొత్తానికే లేరని తాజా సర్వేలో తేలింది. దీంతో కొన్ని చోట్ల జూనియర్ ఫ్యాకల్టీతోనే నెట్టుకొస్తున్నందున ఆ కాలేజీల గుర్తింపు రద్దయ్యే అవకాశం ఉన్నదని, భవిష్యత్తులో పీజీ కోర్సులకు అనుమతి లభించదని టీఎస్ఆర్డీఏ ఆవేదన వ్యక్తం చేసింది. పలు వైద్య కళాశాలల్లోని కీలకమైన 70% విభాగాల్లో కనీసం ఒక్క ప్రొఫెసర్ కూడా లేరని స్పష్టం చేసింది. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ వాటిలో సైతం అధ్యాపకులు తక్కువగానే ఉన్నట్టు పేర్కొన్నది. 120 విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లే లేరని, కేవలం ఒక్కరే ఫ్యాకల్టీ మెంబర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్) ఉండటంతో వారిపై అకడమిక్ ఒత్తిడి పెరిగిందని తెలిపింది.
ఎంబీబీఎస్ విద్యపై తీవ్ర ప్రభావం
యూజీ వైద్య విద్యకు పునాదిగా ఉండే ప్రీ-క్లినికల్, పారా క్లినికల్ విభాగాల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. దీంతో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఫొరెన్సిక్ మెడిసిన్‌పై తీవ్ర ప్రభావం పడుతున్నదని, కొన్ని కాలేజీల్లో ఈ ఏడు విభాగాల్లో ఫ్యాకల్టీ లేదని వెల్లడైంది. దీంతో ఆయా కాలేజీల్లో ఎంబీబీఎస్ మొదటి, రెండో సంవత్సరం విద్యలో నాణ్యత తగ్గిపోతున్నట్టు టీఎస్ఆర్డీఏ తన సర్వే నివేదికలో పేర్కొన్నది. పలు కాలేజీల్లోని అనేక విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు స్వల్పకాలిక కాంట్రాక్టు పద్ధతిలో, మరికొన్ని విభాగాల్లో 100% టీచింగ్ స్టాఫ్ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారని, దీంతో ఆయా విభాగాలు సీనియర్ రెసిడెంట్ల (ఎస్ఆర్)పై ఆధారపడి పనిచేస్తున్నాయని పేర్కొన్నది. కేవలం ప్రొఫెసర్లు మాత్రమే రెగ్యులర్ పద్ధతిలో, జూనియర్లతోపాటు ఇతర సిబ్బంది అంతా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఉన్న 600కుపైగా విభాగాల్లో 441 డిపార్ట్మెంట్లపై అధ్యయనం నిర్వహించి ఈ నివేదికను రూపొందించినట్టు టీఎస్ఆర్డీఏ ప్రతినిధులు తెలిపారు.
జీరో ఫ్యాకల్టీ విభాగాలు ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు
జోగుళాంబ గద్వాల, ఆసిఫాబాద్,కొడంగల్, భూపాలపల్లి, నారాయణపేట
తీవ్రంగా ప్రభావితమవుతున్న విభాగాలు
అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ,ఫార్మకాలజీ, మైక్రో బయాలజీ,సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్,ఫొరెన్సిక్ మెడిసిన్
సీనియర్ ఫ్యాకల్టీ లేకపోతే జరిగే నష్టం
అకడమిక్ పర్యవేక్షణ, పాఠ్యాంశాల ప్లానింగ్, పరీక్షల నిర్వహణ, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ