Tata Motors | టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలు పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆయా వాహనాల శ్రేణిని బట్టి 2-2.5 శాతం పెంచుతామని మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. వివిధ రకాల మోడల్స్, వేరియంట్ వెహికల్స్‌ను బట్టి ఆయా వాహనాల ధరలు పెరుగుతాయన్నది. స్టీల్, అల్యూమినియం, వాహనాల తయారీలో వాడే ఇతర విలువైన లోహాల ధరలు శరవేగంగా పెరిగాయని టాటా మోటార్స్ పేర్కొంది. ముడి సరుకుపై పెరిగిన ఖర్చులకు ఇది అదనంగా మారిందని వెల్లడించింది.
పలు ఆదా చర్యలు చేపట్టడం ద్వారా పెరిగిన ధరల ప్రభావాన్ని తగ్గించడానికి కృషి చేశామని టాటా మోటార్స్ పేర్కొంది. కొంత మేరకు వాహనాల ధరలు పెంచడంతో వినియోగదారులపై భారం మోపక తప్పడం లేదని వెల్లడించింది.
ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవడంతో అన్ని రకాల మోడల్ కార్లు, వాహనాలపై మూడు శాతం వరకు ధరలు పెరుగుతాయని గత వారం మెర్సిడెస్ బెంజ్ ప్రకటించింది. ఇన్పుట్ కాస్ట్ వ్యయం పెరగడం వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.