Tata Harrier | టాటా మోటార్స్ ఎస్యూవీ కారు ‘టాటా హారియర్’ విక్రయాల్లో కీలక మైలురాయిని దాటేసింది. నాలుగేండ్ల క్రితం మార్కెట్లోకి ఎంటరైన ‘టాటా హారియర్’ ఇప్పటి వరకు లక్ష కార్లు విక్రయించింది. భారత్ మార్కెట్లోకి 2019 జనవరిలో ప్రవేశించింది. ఈ కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కారు 19 వేరియంట్లలో లభ్యం అవుతున్నది. ఎస్యూవీ సెగ్మెంట్లో హ్యుండాయ్ మోటార్ ఇండియా క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా తదితర కార్లతో పోటీ పడుతుంది.
రేంజ్ రోవర్ ఎస్యూవీ కారు జాగ్వార్ లాండ్ రోవర్ మాదిరిగా డీ8, ఒమేగా ఆర్క్ ప్లాట్ ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకున్న తొలి ఎస్యూవీ కారు ‘టాటా హారియర్’. గత కొంత కాలంగా ఈ ఎస్యూవీ కారు పలు అప్డేట్లతో ముందుకు వస్తున్నది. డార్క్, కామో ఎడిషన్లతో యూజర్లకు అందుబాటులో ఉంటుంది. తాజాగా రెడ్ డార్క్ ఎడిషన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ కారు ధర రూ.15-24.05 లక్షల మధ్య పలుకుతుంది.
ఈ ఏడాది ప్రారంభంలో టాటా మోటార్స్.. అప్డేటెడ్ వర్షన్ రెండో దశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా డెవలప్ చేసిన ఇంజిన్ వేరియంట్ ఆవిష్కరించింది. 2.0 – లీటర్ కైరోటెక్ డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 168 బీహెచ్పీ విద్యుత్, 350 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 6- స్పీడ్ టార్చ్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. త్రీ- రో ఎస్యూవీ కారు సఫారీలోనూ ఇదే ఇంజిన్ వినియోగిస్తున్నారు.
తాజాగా మార్కెట్లోకి వచ్చిన రెడ్ డార్క్ ఎడిషన్ హారియర్ కారులో 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, వాయిస్ కమాండ్స్, ఆపిల్ కార్ ప్లే, జేబీఎల్ స్పీకర్ సిస్టమ్‌కు కనెక్ట్ అవుతుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా 7-అంగుళాల టీఎఫ్టీ యూనిట్‌కు అప్డేట్ చేసింది.
అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (అడాస్) వంటి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సఫారీతోపాటు ‘అడాస్’ ఫీచర్లు గల కారు హారియర్. అడాస్’లో పార్వర్డ్ కొల్లిషన్ వార్నింగ్, రేర్ కొల్లిషన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, డోర్ ఓపెన్ అలర్ట్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ చేంజ్ అలర్ట్, హై బీమ్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ తదితర ఫీచర్లు ఉంటాయి.