Tata Tiago & Tigor CNG | టాటా మోటార్స్ తన ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ టియాగో, సెడాన్ టైగోర్ కార్లను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ విత్ సీఎన్జీ ఫ్యూయల్ ఆప్షన్ తో మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కార్లు ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో అందుబాటులో ఉంటాయి. సీఎన్జీ ఫ్యూయల్ ఆప్షన్ మినహా రెండు కార్ల డిజైన్, ఇతర ఫీచర్లు యధాతథంగా కొనసాగుతాయి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తోపాటు సీఎన్జీ మోడ్లో టాటా టియాగో, టాటా టైగోర్ కిలో సీఎన్జీపై 28.06 కి.మీ మైలేజీ ఇస్తాయి. పెట్రోల్ వేరియంట్ ఇంజిన్ లీటర్ పెట్రోల్ పై 20 కి.మీ మైలేజీ అందిస్తుంది.
హ్యాచ్ బ్యాక్ టాటా టియాగో, సెడాన్ టాటా టియాగో విత్ సీఎన్జీ ఫ్యుయల్ ఆప్షన్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్లలో మారుతి సెలిరియో, మారుతి వాగన్ ఆర్, సెట్రోల్ సీ3 కార్లతో టాటా టియాగో పోటీ పడుతుంది. మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్, హ్యుండాయ్ ఔరా మోడల్ కార్లకు టాటా టైగోర్ గట్టి పోటీ ఇస్తాయి.
టాటా టియాగో సీఎన్జీ కారు ధర రూ.7.89 లక్షల నుంచి రూ.8.89 లక్షలు (ఎక్స్ షోరూమ్), టాటా టైగోర్ సీఎన్జీ వర్షన్ కారు రూ.8.84 లక్షల నుంచి రూ.9.54 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతాయి. టియాగో టొర్నాడో బ్లూ, టియాగో ఎన్ఆర్జీ టియాగో, టైగోర్ మీటర్ బ్రాంజ్ కలర్లలో లభిస్తాయి. టాటా టియాగో ఐసీఎన్జీ, టాటా టైగోర్ ఐసీఎన్జీ ఏఎంటీ వేరియంట్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆన్లైన్లో గానీ, డీలర్ల వద్ద గానీ కస్టమర్లు రూ.21 వేల టోకెన్ సొమ్ము చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు.
టాటా టియాగో ఐసీఎన్జీ, టాటా టైగోర్ ఐసీఎన్జీ కార్లు 1.2 లీటర్లతోపాటు 3-సిలిండర్ బయో ఫ్యుయల్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటాయి. ఈ ఇంజిన్ పెటోల్ మోడ్లో గరిష్టంగా 84 బీహెచ్పీ విద్యుత్, 113 ఎన్ఎం టార్క్ వెలువరిస్తాయి. సీఎన్జీ మోడ్ లో గరిష్టంగా 72 బీహెచ్పీ విద్యుత్, 95 ఎన్ఎం టార్క్ వెలువరిస్తాయి. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో పని చేస్తాయి.
టాటా టియాగో అండ్ టైగోర్ సీఎన్జీ వర్షన్ కార్లలో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో ఏసీ, 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 8-స్పీకర్స్, సేఫ్టీ కోసం డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెషర్ మానిటర్, రేర్ పార్కింగ్ కెమెరా విత్ సెన్సర్, రేర్ డీఫాగర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ప్రస్తుతం సీఎన్జీ వర్షన్లో మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్స్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు టాటా మోటార్స్ సీఎన్జీ కార్లు గట్టి సవాల్ విసురుతున్నాయి. మారుతి ఎస్-ప్రెస్సోతోపాటు సెలెరియో, వాగన్ఆర్, ఎకో, ఆల్టో, ఎర్టిగా మోడల్ కార్లలో సీఎన్జీ కిట్ అందిస్తున్నాయి. ఇక గ్రాండ్ ఐ10, ఔరాతోపాటు ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన ఎక్స్టర్ మోడల్ కార్లలో హ్యుండాయ్ సీఎన్జీ ఆప్షన్ కల్పిస్తుంది.